అప్పుడే చేతెలెత్తేసిన ‘ టీడీపీ శ్రీ భ‌ర‌త్‌ ‘ … గెలిచే స్కోప్ లేక ఏం చేస్తున్నాడంటే…?

ఈసారి నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న నేతల స్థానాలలో అధికార పార్టీ అభ్యర్థులు చెమటలు పట్టిస్తున్నారు. కుప్పంలో గత ఎన్నికలలోనే చంద్రబాబు చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. కొన్ని రౌండ్లలో వెనుకబడిపోయారు. బాలకృష్ణ మాత్రం వరుసగా రెండవ సారి హిందూపురంలో గెలిచినా ఆయన స్థాయికి తగ్గే మెజార్టీ రాలేదు. ఇక తొలిసారి ఎన్నికలలో పోటీ చేసిన బాలయ్య అల్లుళ్ళు లోకేష్ మంగళగిరిలో, శ్రీ భరత్ విశాఖ ఎంపీగా ఓడిపోయారు. మరోసారి ఈ నలుగురు అవే స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. గుడ్డిలో మెల్లగా ఈసారి లోకేష్ గెలవచ్చు అన్న మౌత్ టాక్‌ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ విశాఖపట్నం నుంచి పోటీలో ఉన్నారు.

మామూలుగా అయితే ఇటు కూటమి ప్రభావం.. గత ఎన్నికలలో స్వల్ప తేడాతో ఓడిపోయిన సానుభూతితో ఈసారి భరత్ భారీ మెజార్టీతో గెలుస్తారు అన్న చర్చలు వినిపించాలి.. ఎన్నికల దగ్గర పుడుతున్న కొద్ది పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. రోజు రోజుకు భరత్ పరిస్థితి దిగజారుతోంది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి కంటే కూడా విశాఖ నగర అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించి.. నగరంలో ఎప్పుడు.. ఎవరికి ఏ సమస్య ఉన్నా పరిష్కారం అయ్యేలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అందుకే కీలకమైన విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో వైసీపీ అప్రతిహత విజయం సాధించి మేయర్ పదవిని కైవసం చేసుకుంది.

దీనికి తోడు ప్రతిష్టాత్మకమైన విశాఖ మేయర్ పదవిని జగన్ బీసీ మహిళకు కేటాయించారు. దీంతో బీసీ వర్గాలు గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి బాగా దగ్గర అయ్యాయి. మొత్తం మీద వైసీపీకి బాగా ప్లస్ అవుతున్న మాట వాస్తవం. అలాగే బీసీలకే చెందిన వంశీకృష్ణకు ఎమ్మెల్సీ కూడా కట్టబెట్టారు. పైన నాయకుల సంగతి ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీకి తిరుగులేని పట్టు వచ్చేసింది. సామాజిక సమీకరణాల పరంగాను ఓవరాల్‌గా చూస్తే అన్ని వర్గాల ఓటర్లు.. దిగువ మధ్యతరగతి పేదలు కూడా వైసీపీకి ఓటు వేయాలని పరంగా నిర్ణయించుకున్నారు. నిన్నటి వరకు తన అంగబలం, అర్ధబలంతో పాటు కూటమి బలంతో చాలా ఈజీగా గెలిచి పార్లమెంటులో అడుగు పెడతాను అనుకున్నా శ్రీ భరత్ కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో వస్తున్న సర్వేలు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న బొత్స‌ ఝాన్సీకి అనుకూలంగా ఉండడంతో.. భరత్ చివరకు డ‌బ్బు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. తన పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల‌లో భారీ ఎత్తున డబ్బు ఖర్చుపెట్టి ఎంపీగా గెలిచేందుకు.. దింపుడు కళ్ళెం ఆశలతో భరత్ ఉన్నట్టు తెలుస్తోంది. అటు భీమిలిలో గంటా.. విశాఖ తూర్పులో వరుసగా మూడుసార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు.. దక్షిణంలో ఆర్థికంగా బలంగా ఉన్న వైసీపీ తాజా మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్.. ఇటు నార్త్‌లో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. గాజువాకలో పల్లా శ్రీనివాస్‌ లాంటి బలమైన నేతలు రంగంలో ఉన్నా కూడా.. విశాఖపట్నం గెలిచే స్కోప్‌లో లేదంటే పరిస్థితి ఎలా ?ఉందో తెలుస్తోంది.

ఓవైపు అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు పెట్టే ఖర్చు.. ఇటు భరత్ సొంతంగా పెడుతున్న ఖ‌ర్చు చూస్తే ఒక విశాఖపట్నంలో రూ.300 కోట్లు దాటుతుందని లెక్కలు వేస్తున్నారు. భరత్ అయితే ఏకంగా రూ.150 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా వైసీపీ ఈక్వేషన్ల ముందు గెలుపు కష్టం అని తేలడంతో భరత్ చివరకు ధన అస్త్రాన్ని విశాఖ ఓటర్ల పై ప్రయోగిస్తున్నట్టుగా కనిపిస్తోంది.