ఈ సారికి ఆయనకు అవకాశం లేనట్లే… అంతే…!

ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. మరోవైపు తాము సింగిల్‌గా పోటీ చేస్తామని వైసీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అడుగులు వేస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ములాఖత్ అయిన తర్వాత… టీడీపీ, జనసేన పార్టీల పొత్తును ఖరారు చేశారు పవన్ కల్యాణ్. దీంతో రెండు పార్టీల నేతల్లో ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే దాదాపు నాలుగేళ్లుగా ఎన్నికల ఆయా నియోజకవర్గాల్లో అటు టీడీపీలో, ఇటు జనసేనలో నేతలంతా సీటు తమదే అని బలంగా చెప్పుకుంటున్నారు. అయితే పొత్తుల ప్రకటన తర్వాత పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

పొత్తుల ప్రకటన వచ్చిన తర్వాత అందరి దృష్టి ప్రధానంగా పవన్ సోదరుడు నాగబాబు వైపు మళ్లింది. ఇందుకు ప్రధాన కారణం.. ఆయన రెండుసార్లు పోటీ చేసిన ఓడిన నరసాపురం పార్లమెంట్ స్థానమే. 2009లో తొలిసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన నాగబాబు… మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. తర్వాత 2019లో జనసేన పార్టీ తరఫున మరోసారి ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు కూడా నాగబాబు ఓడిపోయారు. ఈసారి తప్పకుండా గెలుస్తామని ధీమాతో ఉన్నారు నాగబాబు. అయితే ప్రస్తుతం టీడీపీ – జనసేన పొత్తు నేపథ్యంలో నాగబాబు పరిస్థితి ఏమిటని చర్చించుకుంటున్నారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్. అదే జరిగితే… నరసాపురం పార్లమెంట్ స్థానం బీజేపీకి కేటాయించాలని టీడీపీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో జనసేన పార్టీ కూడా బీజేపీ అభ్యర్థికి తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. అప్పుడు జనసేన పార్టీ నేత నాగబాబు మరోసారి కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతారనేది విశ్లేషకుల మాట. దీంతో మరోసారి నాగబాబుకు చట్టసభల్లో అధ్యక్ష అనే అవకాశం లేకుండా పోయిందని ఇప్పుడు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.