బీజేపీ డబుల్ గేమ్… ఇలా అయితే ఎలా…!?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్. దీనిని తమ పార్టీకి బూస్టులా వాడుకోవాలనేది టీడీపీ నేతల ప్లాన్. తమ అధినేతను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని… కనీసం వయస్సు, అనుభవం కూడా చూడలేదనేది టీడీపీ నేతల మాట. దీనికి వైసీపీ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. అక్రమాలు, అవినీతి చేసినట్లు రుజువైన తర్వాత అనుభవం అనే మాటేమిటంటున్నారు. తప్పు చేసిన వాళ్లు ఎలాంటి వారైనా సరే… శిక్ష అనుభవించాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి తప్పు చేయకపోతే… కోర్టులు రుజువు చేసుకోమని సవాల్ కూడా చేస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు వంటి సీనియర్ నేతను అక్రమంగా అరెస్టు చేశారని వామపక్ష నేతలతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు వ్యాఖ్యానించారు. దీనిపై జాతీయ మీడియాలో సైతం చర్చ జరిగింది.

అయితే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై పాత మిత్రులు, భారతీయ జనతా పార్టీ నేతలు స్పందించిన తీరు మాత్రం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం హస్తం ఉందనేది టీడీపీలో ఓ వర్గం నేతల ఆరోపణ. కేంద్రం అనుమతి లేకుండా వైసీపీ ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదంటున్నారు. అదే సమయంలో కేంద్రం జోక్యం చేసుకుంటే… తమ నేత క్షణాల్లో బయటకు వచ్చేస్తారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై బీజేపీ నేతల స్పందన పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ బీజేపీ నేతలు ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పైగా చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఎవరూ ఎలాంటి కామెంట్లు చేయవద్దని కూడా ఆదేశించారు. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా స్పందిస్తున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌లు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా తప్పుబట్టారు. అరెస్టు అక్రమం అన్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపు ఉండకూడదన్నారు.

ఏపీ నేతలు సైలెంట్‌గా ఉంటే…. తెలంగాణ నేతలు మాత్రం అరెస్టును ఖండిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నేతల సైలెన్స్ వెనుక ఢిల్లీ పెద్దల వాయిస్ ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో… వ్యూహాత్మకంగా తెలంగాణ నేతలు వ్యాఖ్యానించడం ద్వారా… కర్ర విరగకుండా… పాము చావకుండా… అనే సామెతను తలపిస్తున్నారనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు టీడీపీకి చెడు కాకుండా… అటు వైసీపీని దూరం చేసుకోకుండా… బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోదంనే వ్యాఖ్యలు వినిపిస్తోంది.