ఈ నెల 23న ఏం జరగబోతోంది… ఏపీలో భారీ డిస్కషన్…!?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ కుదుపు తప్పదా… ఈ నెల 23న ఏం జరుగుతోంది… అసలు ఈ శనివారం స్పెషల్ ఏమిటీ… ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. ఈ 23న ఏదో జరుగుతుందని… అందులో భాగంగానే మూడు రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల 23వ తేదీతో ముగుస్తున్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది. అయితే ఆ 23 ఏమిటనేదే ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న.

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 ఎమ్మెల్యే స్థానాలే వచ్చాయి. కాబట్టి దానినే సెంటిమెంట్‌గా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భావించినట్లున్నారు. సీఎం జగన్ లండన్ పర్యటన సమయంలో ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండ్ వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేశాయి. ఇక జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత నుంచి పొలిటికల్ సర్కిల్‌లో పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఓ వైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ముందుగా అందరూ ఊహించినట్లు జమిలీ ఎన్నికల బిల్లు కాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. అదే సమయంలో జమిలీ ఎన్నికలపై కూడా జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు తాము కూడా సిద్ధమే అని కేంద్రానికి జగన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం చేస్తారంటున్నారు ఓ వర్గం నేతలు. అదే సమయంలో అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తాడనే మాట కూడా వినిపిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలో 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితో పాటు జగన్ కూడా ముందస్తు ఎన్నికలు వెళ్తాడనే మాట బలంగా వినిపిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని… అసెంబ్లీలోనే చంద్రబాబు అవినీతి గురించి చర్చించిన తర్వాత… అరెస్టులో ఎలాంటి అక్రమం లేదని… కక్ష లేదని రుజువు చేసిన తర్వాత… 23వ తేదీన అసెంబ్లీని రద్దు చేస్తారనే మాట ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా వినిపిస్తోంది. మరి అది నిజమో కాదో తెలియాలంటే… మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.