పొత్తులో ఫైర్‌బ్రాండ్ మంత్రికి రిస్క్?

టిడిపి-జనసేన పొత్తుతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా ఉన్నాయి. టిడిపి జనసేన పొత్తుతో వైసిపి తుడిచిపెట్టుకుపోతుందని పవన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ పొత్తు ను గురించి ప్రకటించగానే పలువురు వైసీపీ నేతలు, మంత్రులు ఘాటుగా స్పందించారు. అందులో మంత్రి జోగి రమేష్ ఘాటుగానే స్పందించారు. సినిమాల వేరు, రాజకీయాలు వేరు అంటూ విమర్శించారు. పవన్ సినిమాల్లో హీరో..రాజకీయాల్లో జీరో అన్నారు. కానీ టీడీపీతో పవన్ పొత్తు వల్ల ఏపీలో మొదట నష్టపోయేది జోగి రమేష్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

జోగి రమేష్ పోటీ చేసిన పెడన నియోజకవర్గం టిడిపికి పట్టుకున్న నియోజకవర్గం కానీ జగన్ హవాలో జోగి గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి జోగికి దాదాపు 62 వేల ఓట్లు పడగా, టి‌డి‌పికి 54 వేలు, జనసేనకు 25 వేలు పైనే ఓట్లు పడ్డాయి. అంటే టి‌డి‌పి-జనసేన కలిస్తే జోగికి చెక్ పడిపోయేది.

ఇప్పుడు రెండు పార్టీలు కలిశాయి కాబట్టి..నెక్స్ట్ ఎన్నికల్లో జోగికి గెలుపు డౌటే అంటున్నారు. పెడనలో జనసేన కార్యకర్తలు ,పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎక్కువగానే ఉన్నారు. గతంలో టిడిపి- జనసేన విడిగా పోటీ చేయటం వల్ల ఓట్లు చీలి జోగి గెలిచారు తప్ప జోగి చేసిన అభివృద్ధి వల్ల కాదు అని టిడిపి, జనసేన నాయకులు అంటున్నారు. రాబోయే ఎన్నికలలో టిడిపి, జనసేన భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిడిపి-జనసేన పొత్తు తో జోగి ఇంటికే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.