రుషికొండలో ఏం కడుతున్నారో తెలుసా….?

రుషికొండ… గతేడాది వరకు విశాఖ వాసులకు మాత్రమే బాగా తెలిసిన ప్రాంతం. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగుతున్న ప్రదేశం. విశాఖలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్న ప్రాంతం రుషి కొండ. వైసీపీ ప్రభుత్వం ఆ కొండను తవ్వేసి ఏదో కడుతోందని ఇప్పటి వరకు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిని పరిశీలించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రుషికొండకు వెళ్లారు కూడా. అయితే పోలీసు ఆంక్షల కారణంగా అక్కడ ఏం నిర్మిస్తున్నారు అనేది బయటకు తెలియలేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మూడు రాజధానుల ప్రకటన చేశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియకు న్యాయ పరమైన చిక్కుల కారణంగా అడుగు ముందుకు పడలేదు.

అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం… వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధించాలంటే… విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగించాలని బలంగా వ్యాఖ్యానించారు. ఇందుకోసం రాష్ట్ర సచివాలయాన్ని విశాఖకు మార్చేందుకు సిద్ధమయ్యారు. ఇక ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కూడా విశాఖలో ఏర్పాటు చేసేందుకు పలు భవనాలను కూడా అధికారులు పరిశీలించారు. ఇదే సమయంలో రుషికొండ దిగువన భారీ భవనాల నిర్మాణం ప్రారంభించింది వైసీపీ ప్రభుత్వం. దీంతో అందరి ఫోకస్ అటువైపు తిరిగింది. అక్కడ ఏదో కడుతున్నారని.. పర్యావరణానికి హాని కలుగుతోందని కోర్టులో కేసులు కూడా వేశారు. వీటిపై నియమించిన కమిటీలు కూడా రుషికొండ ప్రాంతాల్లో పర్యటించాయి. అయితే అక్కడ ఏం కడుతున్నారనేది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది.

తాజాగా విపక్ష నేతలు రుషికొండలో సీఎం కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నాడని… విమర్శించారు. అటు జగన్ కూడా రాబోయే అక్టోబర్ నుంచి తాను విశాఖకు మకాం మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రుషికొండ దిగువన పర్యాటక శాఖ నిధులతో సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నట్లు ఆరోపించారు కూడా. అయితే ఈ ఆరోపణలకు వైసీపీ నేతలు బ్రేక్ వేశారు. అక్కడ కడుతున్న భవనాలు ఏమిటో క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు పోస్ట్ చేసిన వీడియోకు కౌంటర్ ఇచ్చారు. విశాఖను దోచుకున్నది టీడీపీ నేతలని… గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు అనలేదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు దోచుకున్న 450 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకున్నది వైఎస్ జగన్ ప్రభుత్వం అని… ఇక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి… రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం చేపడుతున్నారని ప్రకటించారు. దానీ మీద మీ పార్టీ దుష్ప్రచారం చూస్తుంటే… మీకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం ఇష్టం లేదనిపిస్తోంది… అంటూ పార్టీ అధికారికంగా ట్వీట్ చేసింది. దీంతో విశాఖ రుషికొండలో ఏం కడుతున్నారనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక వీటికి ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.