విశాఖలో ఎవరి బలమెంత? ఆధిక్యం ఎటువైపు?

అతి త్వరలో జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెడుతున్న విషయం తెలిసిందే. దసరా నాటికి జగన్ విశాఖలో కాపురం పెడతానని చెప్పారు. అప్పటినుంచే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది. అంటే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది. దీంతో విశాఖపై వైసీపీకి రాజకీయంగా కూడా పట్టు దొరుకుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇక్కడ కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మూడు రాజధానులు అని చెప్పి మూడేళ్లు దాటేసింది.

ఇప్పటివరకు ఆ దిశగా పనులు జరగలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు విశాఖకు వచ్చి పాలన మొదలుపెడితే పరిస్తితి ఎలా ఉంటుందనేది చెప్పలేం. పైగా రాజకీయంగా అనుకున్న మేర లబ్ది జరుగుతుందనేది కూడా డౌటే. ఎందుకంటే మూడు రాజధానులు ప్రకటించాక కూడా విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి గొప్ప విజయం దక్కలేదు. టి‌డి‌పి గట్టి పోటీ ఇచ్చింది. అటు ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో టి‌డి‌పి విజయం సాధించింది.  దీని బట్టి చూస్తే విశాఖలో వైసీపీకి రాజకీయంగా ప్లస్ అవ్వడం అనేది కాస్త కష్టమే.

ఇక ప్రస్తుతం అక్కడ పరిస్తితులని చూస్తుంటే వైసీపీకి స్వల్ప లీడ్ మాత్రం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ 11, టి‌డి‌పి 4 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఆ బలం కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రస్తుతం..అరకు, పాడేరు, మాడుగుల లాంటి సీట్లలో లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. టి‌డి‌పికి..విశాఖ ఈస్ట్, వెస్ట్, నర్సీపట్నంలో లీడ్ కనిపిస్తోంది. జనసేనకు గాజువాకపై పట్టు ఉంది.

అయితే టి‌డి‌పి-జనసేన కలిస్తే వైసీపీ 5 సీట్లు గెలుచుకోవడం కూడా కష్టమని అంటున్నారు. పొత్తు ప్రభావం విశాఖ నగరంతో పాటు భీమిలి, గాజువాక, అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, చోడవరం లాంటి స్థానాల్లో ఉంది. ఒకవేళ పొత్తు లేకపోతే విశాఖలో వైసీపీకి ఆధిక్యం ఉంటుంది..పొత్తు ఉంటే టి‌డి‌పి-జనసేనకు ఆధిక్యం.