బాబు ప్రాజెక్టు పాలిటిక్స్..జనం నమ్ముతారా?

జగన్ ప్రభుత్వం టార్గెట్ గా గత నాలుగేళ్లుగా చంద్రబాబు విమర్శనస్త్రాలు సంధిస్తూనే వస్తున్నారు. సందు దొరికితే చాలు. ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ విరుచుకుపడుతున్నారు. జగన్ మంచి చేసిన వాటిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బాబు కొత్త రూట్ వెతుక్కున్నారు. జగన్ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయని, అసలు ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టలేదని, తమ హయాంలోనే భారీగా ఖర్చు పెట్టమని ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి హడావిడి చేశారు.

ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లడానికి బాబు రెడీ అయ్యారు. ప్రతి ప్రాజెక్టుని సందర్శించి..జగన్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పడానికి..అక్కడే బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే మొదట రాయలసీమలోని ముచ్చుమర్రి నుంచి బాబు టూర్ మొదలవుతోంది. తొలుత నందికొట్కూరులో బహిరంగ సభ జరుగుతుంది. తర్వాత ముచ్చుమర్రి, బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ ప్రాజెక్టులని చంద్రబాబు సందర్శిస్తారు.

తర్వాత రోజు పులివెందులలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఆగష్టు 1,2 తేదీల్లో నందికొట్కూరు, పులివెందుల సభ..3వ తేదీ.. రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు ఎత్తిపోతలను సందర్శించి.. గొల్లపల్లి రిజర్వాయర్‌ వద్దకు వెళ్తారు. తర్వాత కదిరి బహిరంగ సభలో పాల్గొంటారు. నెక్స్ట్ మదనపల్లె, పీలేరు, పలమనేరు, చిత్తూరుల్లో పర్యటిస్తారు. ఇలా వరుసగా పది రోజుల పాటు శ్రీకాకుళం వరకు పర్యటిస్తారు.

సాగునీటి ప్రాజెక్టులని సందర్శించి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. అయితే గత చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టులని పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ఇప్పుడు హడావిడి చేయడం వల్ల ప్రజలు నమ్మే పరిస్తితి కనిపించడం లేదు. కాబట్టి బాబు ఎన్ని చేసిన ఉపయోగం ఉండదు.