పిఠాపురం-రాజానగరం జనసేనకే ఫిక్స్ చేసుకుంటారా?  

జనసేన అధినేత పవన్ దూకుడు కనబరుస్తున్నారు. ఇంతకాలం కాస్త ఆచి తూచి అడుగులేస్తూ..ఎక్కువ శాతం సినిమా షూటింగుల్లో బిజీగా గడిపిన ఆయన..ఇప్పుడు జనసేనపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతూ..జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అలాగే జనసేనలోకి వలసలని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములుని జనసేనలోకి చేర్చుకున్నారు.

అటు తాజాగా విశాఖలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ సైతం..పవన్‌ని కలిశారు. ఈయన త్వరలో జనసేనలో చేరబోతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో కీలక నేతలు జనసేనలో చేరతారని తెలుస్తుంది. ఇక ఇంతకాలం టి‌డి‌పితో పొత్తు పై ఆలోచించిన పవన్..పెద్దగా నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లని పెట్టడంపై దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు దూకుడు పెంచారు. తాజాగా మూడు స్థానాలకు ఇంచార్జ్‌లని పెట్టారు.  పిఠాపురం నియోజకవర్గంలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ, కొవ్వూరు నియోజకవర్గంలో టి.వి.రామారావు లని ఇంచార్జ్‌లుగా పెట్టారు.

అయితే టి‌డి‌పితో పొత్తుని దృష్టిలో పెట్టుకునే పవన్ ఇంచార్జ్‌లని నియమిస్తున్నారని తెలుస్తుంది. పొత్తులో భాగంగా జనసేన కోరుకునే సీట్లలో పిఠాపురం, రాజానగరం కూడా ఉన్నాయి. అందుకే ఆ రెండు సీట్లలో ఇంచార్జ్‌లని పెట్టినట్లు తెలుస్తుంది. ఇక కొవ్వూరు అనేది టి‌డి‌పి కంచుకోట కాబట్టి..ఆ సీటు టి‌డి‌పి వదులుకునే అవకాశాలు పెద్దగా లేవు.

కాకపోతే అక్కడ టి‌డి‌పి లో ఆధిపత్య పోరు ఉంది..కాబట్టి చంద్రబాబు ప్లాన్ మార్చి జనసేనకు ఆ సీటు ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. రాజానగరంలో ఎలాగో టి‌డి‌పికి ఇంచార్జ్ లేరు..కాబట్టి ఆ సీటు జనసేనకే సెట్ చేయవచ్చు. పిఠాపురంలో టి‌డి‌పి బలంగానే ఉంది..కాకపోతే జనసేన కూడా స్ట్రాంగ్. మరి ఈ సీటు ఏం చేస్తారో చూడాలి.