ఎన్డీయే కూటమిలోకి టీడీపీ..ఛాన్స్ లేదట?

రానున్న ఎన్నికల్లో బి‌జే‌పి సింగిల్ గెలిచి అధికారం దక్కించుకోవడం కాస్త కష్టమైన పనే. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి కేంద్రంలో సులువుగా పాగా వేయడం జరిగే పని కాదు. అందుకే ఈ సారి మిత్రపక్షాల మద్ధతుతో ముందుకెళ్లాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలతో సమావేశం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 18న ఎన్డీయే పక్షాల మీటింగ్ జరగనుంది.

అయితే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. మళ్ళీ ఎప్పుడు మిత్రపక్షాలని పట్టించుకోలేదు. సొంతంగానే అధికారంలోకి రావడంతో బి‌జే‌పి తనదైన శైలిలోనే ముందుకెళుతూ వచ్చింది. ఈ క్రమంలోనే బి‌జే‌పి వైఖరి నచ్చక పలు మిత్రపక్షాలు బయటకొచ్చేశాయి. ఇప్పుడు ఏదో కొన్ని పార్టీలు మాత్రమే ఎన్డీయేలో మిగిలాయి. కానీ ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడానికి బి‌జే‌పి కష్టపడాల్సి ఉంది. అటు కాంగ్రెస్ తో కలిసి విపక్షాలు ఐక్యంగా ముందుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో బి‌జే‌పికి రిస్క్ పెరుగుతుంది.

అందుకే తమ మిత్రపక్షాలతో ముందుకెళ్లాలని బి‌జే‌పి డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే గతంలో తమకు దూరమైన మిత్రపక్షలకు సైతం బి‌జే‌పి ఆహ్వానం పంపిందని…టి‌డి‌పికి సైతం ఆహ్వానం ఇచ్చిందని, ఆ పార్టీ కూడా సమావేశానికి వస్తుందని నేషనల్ మీడియా చెబుతుంది. ఈ తరుణంలో ఎన్డీయేలో చేరే విషయంపై టి‌డి‌పిలో చర్చ నడుస్తుంది. అయితే 2018లోనే టి‌డి‌పి…ఎన్డీయే నుంచి బయటకొచ్చింది..మళ్ళీ ఆ బి‌జే‌పితో కలవలేదు. కానీ ఇటీవల బి‌జే‌పి-టి‌డి‌పి పొత్తు ఉంటుందని ప్రచారం వస్తుంది.

అయితే బి‌జే‌పితో పొత్తు ఉంటే టి‌డి‌పికే నష్టమనే అంచనాలు ఉన్నాయి. అందుకే టి‌డి‌పి..బి‌జే‌పితో కలిసే విషయం ఆలోచిస్తుంది. అదే సమయంలో  ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశానికి తాము హాజరవుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని టీడీపీ స్పష్టం చేసింది. తమకు ఎలాంటి ఆహ్వానం లేదని,  అసలు ఆ సమావేశం ఉందో లేదో కూడా తెలియదని, ఒక కూటమిలో చేరేముందు అనేక విషయాలపై రాజకీయ చర్చలు జరగాలని,  ఏదీ లేకుండా సమావేశానికి హాజరు కావడం జరగదని పార్టీ నేతలు అంటున్నారు. అంటే ఎన్డీయే సమావేశానికి టి‌డి‌పి దూరంగా ఉండనుంది.