గన్నవరం పంచాయితీ..వంశీపై యార్లగడ్డ పోటీ.!

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో సీట్ల కోసం పంచాయితీ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల రామచంద్రాపురం స్థానంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ల మధ్య రచ్చ నడుస్తుంది. ఇక వేణుకు మళ్ళీ సీటు ఇస్తే తాను గాని తన తనయుడుగాని ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని సుభాష్ సంచలన ప్రకటన చేశారు. జగన్ సర్ది చెప్పిన బోస్ తగ్గట్లేదు.

ఈ రచ్చ అలా కొనసాగుతుండగానే గన్నవరంలో పంచాయితీ మొదలైంది. ఈ పంచాయితీ ఎప్పటినుంచో ఉంది. ఇక్కడ టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీ..వైసీపీలో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావులకు పొసగడం లేదు. అలాగే మరో నేత దుట్టా రామచంద్రారావుకు కూడా వంశీ అంటే పడటం లేదు. అయితే వీరిని కలపాలని జగన్ ప్రయత్నించారు..కానీ అదేం వర్కౌట్ అవ్వలేదు. ఇక వంశీ-యార్లగడ్డ ఎవరికి వారే అన్నట్లు ఉన్నారు. ఎవరి వర్గం వారిదే.

అయితే ఈ సారి వైసీపీ నుంచి వంశీ బరిలో దిగడం ఖాయం. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక వంశీ పోటీ చేస్తే ఆయనకు యార్లగడ్డ, దుట్టా సహకారం ఉండదు. అదే సమయంలో యార్లగడ్డ సైతం సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఆయన కూడా సీటు వస్తే వైసీపీ నుంచి పోటీ చేస్తానని లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అంటున్నారు.

అలా జరిగితే వంశీకి కాస్త రిస్క్ ఉంటుంది. ఇక యార్లగడ్డ టి‌డి‌పి వైపుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కాకుండా ఎన్నికల సమయంలో యార్లగడ్డ అటు వైపు వెళ్ళి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అదే జరిగితే వంశీ-యార్లగడ్డల మధ్య మళ్ళీ టఫ్ ఫైట్ నడుస్తుంది.