మేయర్ గారు…. జర ఇటు కూడా కాస్త చూడండి..!

హైదరాబాద్ నగర మేయర్ మీకు ఎక్కడైనా కనిపించారా… అసలామె ఉన్నారా… ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి ప్లీజ్… ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ పోస్ట్. నిజమే హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఏమయ్యారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ సంగతి సరే సరి. చినుకు పడుతోంది అంటే చాలు. నగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా… రోడ్లన్నీ చిన్నపాటి వర్షానికే జలమయం అవుతాయి. ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందో… ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యిందో అని భయం భయంగా బతుకుతుంటారు నగరవాసులు. పేరుకే గ్రేటర్ అయినప్పటికీ… పరిస్థితి మాత్రం లోయర్ అనే సెటైర్లు కూడా వేస్తున్నారు నెటిజన్లు.

వాస్తవానికి హైదరాబాద్ నగరంలో ఏ చిన్న కార్యక్రమం జరిగిన అక్కడ ఠక్కున ప్రత్యక్షమయ్యే నేత మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ఆ తర్వాత మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ప్రారంభోత్సవం అయినా, ప్రమాదమైనా సరే… వీరిద్దరు తప్ప… మేయర్ కనిపించిన దాఖలాలు లేవు. ఓ వైపు భారీ వర్షాలకు హైదరాబాద్ నగర పరిధిలోని హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ లు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి వర్షాలు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ట్రాఫిక్ కష్టాలు నగర వాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కూడా… మేయర్ గద్వాల విజయలక్ష్మి దర్శనం మాత్రం లేదు.

హైదరాబాద్ నగర పాలక సంస్థలో పనులన్నీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగానే జరుగుతున్నాయి. అధికారులతో సమావేశాలను కూడా కేటీఆర్ నిర్వహిస్తున్నారు తప్ప… మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి జీహెచ్ఎంసీ మేయర్ గా ఎన్నికైన నాటి నుంచి కూడా వివాదాలు గద్వాల విజయలక్ష్మిని చుట్టు ముడుతున్నాయి. పెంపుడు కుక్కలతో కలిసి ఒకే కంచంలో భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో దుమ్ము దులిపేసింది. కుక్కల దాడిలో చిన్నారులు మృతి చెందిన సమయంలో మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమయ్యాయి. చికెన్ షాపుల కారణంగానే మనుష్యులు మీద కుక్కలు దాడి చేస్తున్నాయని… దీనికి జీహెచ్ఎంసీ ఏం చేస్తుందని మేయర్ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. చివరికి వివాదాస్పద దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ కూడా గద్వాల విజయలక్ష్మి తీరుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు వర్షాలు, మరోవైపు ట్రాఫిక్ కష్టాలు, డ్రెయినేజీ వ్యవస్థ తీరు… పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కూడా… మేయర్ మాత్రం అధికారులతో ఒక్కసారి కూడా భేటీ అవ్వలేదు. అసలు మురుగునీటి సరఫరా ప్రణాళిక ఎలా ఉందో కూడా సమీక్షించలేదు. ఎల్బీ నగర్ దగ్గర నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ శ్లాబ్ కూలిన ఘటనలో పది మంది గాయపడ్డారు. కానీ మేయర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో అంతా ఒకటే మాట…. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఏమయ్యారు అని.