దేశంలో బీజేపీ సర్కార్ హ్యాట్రిక్ సాధ్యమేనా…!?

దేశంలో తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2014లో లోక్ సభలో తొలిసారి కాలుపెట్టిన మోదీ… వరుసగా రెండు సార్లు ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నమో నినాదంతో తొలిసారి, అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటూ రెండోసారి ఎన్డీయే సర్కార్ ఏర్పాటయ్యింది. ఇక మూడోసారి కూడా గెలుపు తమదే అని బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిస్థితి మాత్రం ఆ స్థాయిలో లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పట్టుమని పది నెలలు కూడా సమయం లేదు. పైగా ముందస్తు ఎన్మికలంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పటికే ఎన్నికల పైన ఫోకస్ పెట్టాయి. వరుసగా రెండు సార్లు ఓడిన కాంగ్రెస్… ఈసారి మాత్రం ఎలాగైనా సరే గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే… పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర పూర్తి చేశారు. రెండో విడత కూడా పాదయాత్ర ఉంటుందనేది హస్తం పార్టీ నేతల మాట. పాదయాత్ర ప్రభావమే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని… ఈ ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో సైతం రాహుల్ పాదయాత్ర ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మినహా ఏపీ, తమిళనాడు, కేరళ లో బీజేపీకి కనీస ఓటు బ్యాంకు కూడా లేదు. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, అసోం రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల వాతావరణం లేదనేది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ గానే పోరు నడుస్తోంది. ఇక మధ్యప్రదేశ్ లో కుట్రచేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందనే మాట… పార్టీకి కావాల్సినంత మైనస్. బెంగాల్, ఒడిశా, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు రావనే మాట వినిపిస్తోంది.

వాస్తవానికి మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం ఉత్తర భారతంలోని ఓటర్ల దయతోనే. మోదీ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలు ఎన్డీయే కూటమికి ఓటర్లను దూరం చేశాయి. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, వ్యవసాయ చట్టాలపై రైతుల ఆగ్రహం, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం.. వంటి అంశాలు మోదీ సర్కార్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక తాజాగా విపక్షాల బెంగళూరు సమావేశంలో పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల నేతలే ప్రధానంగా పాల్గొన్నారు. బెంగాల్ లో దీదీ వర్సెస్ మోదీ, పంజాబ్, ఢిల్లీలో ఆప్ వార్ విత్ బీజేపీ, ఒడిశాలో బిజూ జనతా దళ్ హవా, మహారాష్ట్రలో.. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేయడంపై స్థానికంగా పెద్ద ఎత్తున విమర్శలు… ఈ నేపథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ గెలుపు కష్టమనే మాట వినిపిస్తోంది.