కాంగ్రెస్‌లో రాజగోపాల్ రిటర్న్..ఈటల-డీకే-విజయశాంతికి గేలం.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని జోష్ వస్తుంది. ఇప్పటివరకు ఆ పార్టీ చాలా వెనుకబడి ఉంది..కానీ కర్నాటక ఎన్నికల్లో గెలవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఇదే క్రమంలో వలసల జోరు కొనసాగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. వీరి రాకతో పార్టీకి కొత్త ఊపు వచ్చింది. అటు మాజీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిసింది.

ఇదే క్రమంలో గత ఏడాది కాంగ్రెస్ వదిలి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బి‌జే‌పిలోకి వెళ్ళిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి బి‌జే‌పిలో ఆయన అంతగా యాక్టివ్ గా లేరు. పైగా రాష్ట్రంలో బి‌జే‌పికి ఊపు తగ్గింది. ఈ క్రమంలో రాజగోపాల్ మళ్ళీ కాంగ్రెస్ లో చేరడానికి రెడీ అయ్యారని తెలిసింది. ఎలాగో తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి..కాంగ్రెస్ లో చేరికల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో రాజగోపాల్‌ని సైతం మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకోస్తారని తెలుస్తుంది.

రాజగోపాల్ కాంగ్రెస్ లో చేరిక ఖాయమైందని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌ రావు ఠాక్రే, సహ ఇన్‌చార్జి రోహిత్‌ చౌధురి ధ్రువీకరించారు. బీజేపీ ముఖ్యనేతలు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ విజయశాంతితో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ పార్టీతో పాటు బి‌జే‌పికి భారీ షాక్ తగిలేలా ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ రేసులో దూసుకెళుతుందని చెప్పవచ్చు.