కుప్పంలో లక్ష మెజారిటీ..బాబుకు సాధ్యమేనా?

కుప్పంలో ఈ సారి లక్ష మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. కుప్పంని దక్కించుకుంటామని వైసీపీ వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో తాను లక్ష మెజారిటీతో గెలిచేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే అక్కడ లక్ష మెజారిటీ సాధ్యమేనా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో సాధ్యం కాదనే చెప్పాలి. 1989 నుంచి 2019 వరకు వరుసగా గెలుస్తూ వస్తున్న బాబు అత్యధిక మెజారిటీ 66 వేలు అది కూడా 1999 ఎన్నికల్లో వచ్చింది. పలుమార్లు 50 వేలు పైనే, 40 వేలు పైనే మెజారిటీలు సాధించారు.

ఇక గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో కేవలం 30 వేల మెజారిటీ మాత్రమే వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబుకు చెక్ పెట్టే దిశగా ముందుకెళుతున్నారు. అధికార బలంతో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నారు. ఇక కుప్పం అసెంబ్లీని సైతం గెలుచుకుంటామని అంటున్నారు. దీంతో బాబు అలెర్ట్ అయ్యారు. పెద్దగా ఎప్పుడు కుప్పం రాని బాబు..ఇప్పుడు వస్తున్నారు.

అడపాదడపా కుప్పం పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తారు. ఓ భారీ సభ నిర్వహిస్తారు. ఆ సభలో లక్ష మెజారిటీ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తారు. కుప్పంలో లక్ష మెజారిటీ రావడమే లక్ష్యంగా అక్కడే ఉంటూ ఎమ్మెల్సీ శ్రీకాంత్ పనిచేస్తున్నారు.

అయితే వైసీపీ అనుకున్నట్లు గాని, ఇటు బాబు అనుకున్నట్లుగా జరిగే అవకాశాలు తక్కువ. కుప్పం గెలవాలని వైసీపీ అనుకుంటుంది. కానీ అది దాదాపు అసాధ్యమే. ఏదైనా అద్భుతం జరిగితే గెలుస్తుంది. ఇటు బాబుకు లక్ష మెజారిటీ ఇది అసాధ్యమే. గెలుస్తారేమో గాని అంత మెజారిటీ రాదు.