తన సినీ జీవితంపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో 90వ దశకంలో హీరోయిన్ మధుబాల ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా ఆమె నటించిన రోజా సినిమా దేశవ్యాప్తంగా అందరినీ అలరించింది. అందులో ఆమె నటనకు ఎంతో మంది ప్రేక్షకులు ఏర్పడ్డారు. అయితే ఇటీవల ఆమె తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించడం ప్రారంభించింది. సమంత లీడ్ రోల్‌లో నటించిన శాకుంతలం సినిమాలో మధుబాల కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితం మధ్యలో ఆగిపోవడానికి గల కారణంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు ఒకానొక దశలో కేవలం రొమాంటిక్ పాత్రలు మాత్రమే వచ్చాయన్నారు. దీంతో నచ్చిన పాత్రలు రాకపోవడంతో సినిమాలకు దూరమైనట్లు చెప్పారు.

ఇక ఆమె తమిళం, మలయాళం, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో 50కి పైగా చిత్రాలలో నటించారు. అలనాటి హిందీ సినీ నటి మధుబాలా జ్ఞాపకార్థం ఆమె తల్లిదండ్రులకు మధుబాల అని పేరు పెట్టారు. మొట్టమొదటిసారిగా కె. బాలచంద్రన్ దర్శకత్వం వహించిన “అలగరన్” చిత్రంలో మధుబాలా అరంగేట్రం చేసింది. తరువాత, 1992లో విడుదలైన “రోజా” లో ఆమె హీరోయిన్ పాత్ర పోషించింది. కెరీర్ పీక్ దశలో ఉండగా 1999లో ఆమె వివాహం చేసుకుంది. నటి హేమామాలిని బంధువు ఆనంద షాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వారికి ఇద్దరు కుమార్తెలు అమీయా, కీయా ఉన్నారు.