లైన్‌లోకి వచ్చిన లోకేష్..ఎటాకింగ్ స్టార్ట్.!

నిదానంగా నారా లోకేష్ లైన్ లోకి వస్తున్నారు. పాదయాత్రలో స్లో గా అధికార వైసీపీపై ఎటాకింగ్ విమర్శలు మొదలుపెట్టారు. మొదట అనుకున్న మేర పాదయాత్ర హైలైట్ కాలేదు గాని..నిదానంగా పాదయాత్ర పికప్ అవుతుంది..లోకేష్ మాటల దాడి హైలైట్ అవుతుంది. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓ వైపు పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే..వర్గాల వారీగా ప్రజలతో భేటీ అవుతూ వారి సమస్యలని తెలుసుకుని…అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.

ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. అటు యువత, మహిళా ఓటర్లని సైతం టి‌డి‌పికి దగ్గరయ్యేలా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అనూహ్యంగా టీడీపీ బలం పెంచడానికి ప్రయత్నిస్తున్న లోకేష్..తనదైన శైలిలో ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ స్థానిక ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే జేఎంసీ శ్రీనివాసులు భూ బకాసురుడి అవతారమెత్తారని, ఎక్కడ ప్రభుత్వ, ప్రైవేటు భూములు కనపడినా స్వాహా చేసేస్తారని ఫైర్ అయ్యారు.

గుడిపాల మండలం నారగల్లులో 300 ఎకరాల పశువుల మేత భూమిని, చిత్తూరు- తచ్చూరు రోడ్డుకు పక్కనే 80 ఎకరాల భూమిని స్వాహా చేశారని, చివరకు మాజీ సైనికుల భూములను కూడా లాక్కున్న ఘనుడు జేఎంసీ శ్రీనివాసులు అంటూ విరుచుకుపడ్డారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో, తుఫాన్‌ బాధితుల నుంచీ 20 శాతం కమీషన్‌ తీసుకుంటున్న ఘనుడు శ్రీనివాసులు అన్నారు.

జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్పాల్సిన పనేలేదని, జిల్లాలో మద్యం, మైనింగ్‌, ఇసుక అక్రమ రవాణా.. ఇలా ఏ వ్యాపారమైనా ఆయన అనుచరులే ఉన్నారని ఫైర్ అయ్యారు. అటు ” జగన్‌రెడ్డికి అసలైన భయాన్ని పరిచయం చేసే బాధ్యత నాది. 2024 తర్వాత ఇంట్లో నుంచి బయటికి అడుగు ఎలా పెడతాడో చూస్తా’ అని లోకేష్ మాటల దాడి పెంచారు. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తూ ముందుకెళుతున్నారు. మొత్తానికి లోకేష్ నిదానంగా లైన్ లోకి వస్తున్నట్లు కనిపిస్తున్నారు.