జ‌గ‌న్ ఈ వైసీపీ లీడ‌ర్ల విష‌యంలో ఆ సాహ‌సం చేయ‌లేడా..!

వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విష‌యాల‌ను ఎవ‌రూ త‌ప్పించ‌లేరు. అదే.. కొంద‌రు నేత‌ల‌కు టికెట్లు ఇవ్వ‌డం. వారు ప‌నిచేస్తున్నారా ? చేయ‌డం లేదా ? పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించ‌డం లేదా ? అనేది కూడా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. వారికి ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంలో రెండు పార్టీల్లోనూ చ‌ర్చకు వ‌స్తోంది.

తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీలో 30 మంది ప‌నిచేయ‌డం లేద‌ని.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మానికి హాజ రు కావ‌డం లేదని.. వారికి టికెట్లు ఇచ్చేది లేద‌ని కూడా తేల్చి చెప్పారు. దీనిని నిజ‌మే అనుకున్నా.. ఈ జాబితాలో ఉన్న‌వారిని చూస్తే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. అంతేకాదు.. జ‌గ‌న్ చెబుతున్న‌ట్టుగా.. టికెట్లు ఇవ్వ‌కుండా వారిని ప‌క్క‌న పెట్టే ప‌రిస్థితి కూడా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ చెప్పిన జాబితాలో హేమా హేమీ నాయ‌కులు ఉన్నారు.

మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి.. మాజీ మంత్రి కొడాలి నాని, మ‌రో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఎమ్మె ల్యేలు.. వసంత కృష్ణ‌ప్ర‌సాద్ వంటి కీల‌క నేత‌లు ఈజాబితాలో ఉన్నారు. మ‌రి వీరిని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టే సాహ‌సం చేయ‌గ‌ల‌రా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇక‌, టీడీపీ విష‌యాన్ని చూసుకున్నా.. ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.. పార్టీలో యాక్టివ్‌గా లేని వారిని ప‌క్క‌న పెడ‌తామ‌ని.. వారికి టికెట్ ఇచ్చేది లేద‌ని చంద్ర‌బాబు అంటున్నారు.

కానీ, చంద్ర‌బాబు చెబుతున్న జాబితాను చూస్తే.. చాలా మంది కీల‌క నాయ‌కులు.. మాజీ మంత్రులు.. వార‌సులు బోలెడు మంది క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వారిని ప‌క్క‌న పెట్ట‌డం సాధ్య‌మేనా ? అనేది ప్ర‌శ్న‌. అంటే.. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. రెండు పార్టీల్లోనూ.. ఎన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నా.. ఇలాంటి ఉక్కు పిండాల‌కు టికెట్లు కాద‌నే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.