“మన ప్రభుత్వం వచ్చిందిలే.. ఇక, మన ఇష్టం.. అడిగేవారు ఎవరు? “ అనుకున్న వైసీపీ నాయకులకు, మంత్రులకు భారీ షాక్ తగిలింది. ఎందుకంటే.. గతంలో వీరిపై నమోదైన కేసులకు సంబంధించి.. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్ణయమే తీసుకుంది. వైసీపీ ప్రబుత్వం ఏర్పడిన తర్వాత.. ముందు కూడా.. అనేక సందర్భాల్లో వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. వీటిని విచారించాల్సిన వైసీపీ ప్రభుత్వం.. ఎలాంటి విచారణలు లేకుండా.. మూసేసే ప్రయత్నం చేసింది.
దీనికి సంబంధించి జీవో కూడా ఇచ్చింది.. అయితే.. ఈ విషయంపై రాష్ట్ర హైకోర్టు.. సీరియస్ కావడంతో.. తాజాగా జీవోను సర్కారు వెనక్కి తీసుకుంది. ఫలితంగా.. నేతలు తర్జన భర్జనపడుతున్నారు. మొత్తం వైసీపీ ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంటూ ఇచ్చిన జీవోలన్నింటినీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇలా.. కేసులను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోపై… హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం కేసులను ఉపహసంహరిస్తోందని పిటిషనర్ న్యాయవ్యాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ప్రజాప్రతినిధులపై కేసులు ఉపసంహరించాలంటే స్థానిక హైకోర్టు అనుమతి తీసుకోవాలని పిటిషనర్ న్యాయవాది గతంలో ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు అనుమతి లేకుండా కేసులు ఎలా ఉపసంహరిస్తారని గతంలో ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం తరుఫున అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజా ప్రతినిధులపై కేసులు ఉపసంహరిస్తూ ఇచ్చిన మొత్తం జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకు న్నట్లు న్యాయస్థానానికి తెలిపింది. ప్రభుత్వం కేసులు కొనసాగించడంతో.. హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేసింది. అయితే.. ఈ పరిణామాలపై.. వైసీపీ నాయకులు మాత్రం గుర్రుగా ఉన్నారు.