ఎన్టీఆర్ ‘టీడీపీ’..కొడాలి జోస్యం!

ఎప్పుడైతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారో…అప్పటినుంచి కొడాలి నాని సరికొత్త జోస్యం చెబుతూనే వస్తున్నారు. షా-ఎన్టీఆర్ భేటీ విషయంలో మొదట అనేక రకాల చర్చలు నడిచాయి. బీజేపీకి తారక్ మద్ధతు అని, తారక్ ద్వారా టీడీపీ శ్రేణుల మద్ధతు బీజేపీ తీసుకునేందుకు చూస్తుందని..ఇలా రకరకాల చర్చలు నడిచాయి. అయితే మొదట్లోనే ఇదంతా..తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ కొడాలి నాని మాత్రం ప్రతిరోజూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు.

అదిగో ఇక టీడీపీని తారక్ చేతుల్లోకి తీసుకుంటున్నారని, అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు ఎలా పార్టీలోకి లాక్కున్నారో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీని లాగేస్తారని చెబుతున్నారు. తాజాగా దీనిపై మరోసారి కామెంట్ చేశారు. సరైన సమయానికి ఎన్టీఆర్ చేతికి టీడీపీ పగ్గాలు తీసుకుంటారని అన్నారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, కానీ చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుని, పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోతారని కొత్త జోస్యం చెప్పారు. అయితే కొడాలి మాటల్లో కేవలం టీడీపీ శ్రేణులని కన్ఫ్యూజ్ చేయడానికే తప్ప…ఇందులో జరిగేది ఏమి లేదని చెప్పొచ్చు. అంటే టీడీపీ శ్రేణులని కన్ఫ్యూజ్ చేసి చంద్రబాబుని దెబ్బకొట్టాలనే కోణం ఎక్కువ కనిపిస్తోంది.

ప్రస్తుత పరిస్తితుల్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు…ఇప్పటిలో ఆయన రాజకీయాల్లోకి రారు…ఒకవేళ వచ్చిన టీడీపీని లాక్కోవడం అంత ఈజీ కాదు…గతంలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు పార్టీని తీసుకోవడం కొన్ని ప్రత్యేక పరిస్తితుల్లో జరిగింది. కానీ ఇప్పుడు పరిస్తితులు వేరు. అంత తేలికగా పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగే పని కాదు. ఆ విషయం కొడాలికి బాగా తెలుసు..కాకపోతే టీడీపీని దెబ్బతీయడానికి ఈ తరహాలో మాట్లాడుతున్నట్లు ఉన్నారు.