తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే మాట పదే పదే మీడియాతోపాటు సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. ఇంకా ముందుకు వెళ్లి హైకమాండ్‌తో కూడా ఇవే ముచ్చట్లు చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యే సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు, జీహెచ్ఎంసీలో 48 కార్పొరేటర్ల సీట్లను గెలుచుకుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ను కాదని మనపార్టీ సభ్యులు విజయం సాధించారు. భవిష్యత్తులో ఇంకా కష్టపడితే అధికార పీఠంపై కూర్చోవచ్చు అనేది స్థానిక బండి అండ్ టీమ్ సభ్యులు మోదీ, షాలతో పేర్కొన్నారట. దీంతో వారు నిజమేనని నమ్మి వీరు చెప్పింది చెప్పినట్లు నమ్మేస్తున్నారు. అయితే.. ఇదంతా సాధ్యమేనా అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
పోటీచేయడానికి అభ్యర్థులే దొరకరట
ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఓ సర్వేలో కమలం నేతలు షాక్‌కు గురయ్యే వాస్తవాలు బయటకు వచ్చాయట. బీజేపీకి కేవలం 40 చోట్ల మాత్రమే పోటీచేసేందుకుతగిన అభ్యర్థులు ఉన్నారని, మిగతా 79 చోట్ల భూతద్దం పెట్టి వెతికినా దొరకరని సర్వే తేల్చిందని సమాచారం. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లు. అధికారం చేజిక్కించుకోవాలంటే 60 సీట్లు కావాలి. మరి 40 చోట్ల మాత్రమే పోటీచేస్తే పవర్ ఎలా సాధ్యం. మరో సంగతేంటంటే ఆ 40 చోట్ల పోటీచేస్తే గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాలు కేవలం 10 మాత్రమేనట. ఈ విషయాలు సర్వేలో బయటపడటంతో కమలం నాయకులు కక్కలేక, మింగలేక మిన్నకుండిపోయారని తెలిసింది. మరో ఆశ్చర్యకర విషయమేమంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు 108 చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. మరి మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీని ఎలా పటిష్టం చేస్తారో చూడాలి.