ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కరుణించారు. పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) పది రోజుల్లో ఇస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు పెరగనున్నాయి. శుక్రవారం సీఎం జగన్ తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు సీఎంను కలిసి పీఆర్‌సీ ఇవ్వాలని కోరినప్పుడు జగన్ ఈ మాట ఇచ్చేశారు. సీఎం నుంచి ఈ సమాధానం ఊహించని ఉద్యోగ సంఘాల నాయకులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఇప్పటికే ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది..
పీఆర్‌సీ ఇవ్వకపోతే ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని కొందరు అధికారులు జగన్‌కు చెప్పినట్లు తెలిసింది. ఎప్పుడో ఇవ్వాల్సిన పీఆర్‌సీ ఇన్ని రోజులైనా ఇవ్వకపోవడం, పక్కరాష్ట్రమైన తెలంగాణలో ఇవ్వడం గురించి వివరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇపుడు పెరిగిన ధరలు, ఖర్చులకనుగుణంగా తమకు 40 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. అయితే ఉద్యోగులు అడుగుతున్న ఫిట్‌మెంట్‌కు ఓకే చెప్పాలా, లేక తగ్గించాలా అనేది ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ప్రతి నెలా జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి తేవాలో ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో పీఆర్‌సీ అమలు చేస్తే ఖజానాపై భారం అధికంగా పడుతుందని ప్రభుత్వంలోని మేధావులు చెబుతున్నారు. అవన్నీ మాకెందుకు.. మాకివ్వాల్సిన పీఆర్‌సీ ఇవ్వాల్సిందే అని ఉద్యోగులు చెబుతున్నారు. మరి వచ్చే పది రోజుల అనంతరం ఉద్యోగులు అడుగుతున్నట్లు 40 శాతం ఇస్తారా? లేక తెలంగాణలో ఇచ్చినట్లు 30 శాతం ఫిట్‌మెంట్ ఇస్తారా అనేది తెలుస్తుంది.