వరి కొనుగోలు వ్యవహారం తెలంగాణలో కాకరేపుతోంది. పది రోజుల క్రితం హైదరాబాద్, ఢిల్లీలో ఇదే చర్చ. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు వరిని కొనుగోలు చేయాలని ధర్నాలకు దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా సీఎం కేసీఆర్ ఇందిరాపార్కులో నిరసనకు దిగారు. తరువాత ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీలో ఎవరినీ కలువకుండా తిరిగొచ్చారు. మరి ఎందుకు.. ఏమిటి అనేది ఆయనా చెప్పలేదు. ఎవరూ అడగలేదు. ఈ సమస్యపై పార్లమెంటులో కారు పార్టీ సభ్యులు రచ్చచేస్తున్నారు. కేకే ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ ఎంపీలే కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ నిరసనకు దిగుతున్నారు. హౌస్ బయటకూడా మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి నిరసన కార్యక్రమాలు సరే..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాత్రం వీరి వాదనకు భిన్నంగా సమాధానం చెబుతున్నారు. మీరు ఇస్తానన్న కోటానే ఇంకా ఇవ్వలేదు..తెలంగాణ నుంచి ఇంకా 29 లక్షల టన్నుల బియ్యం రావాలి.. అది ఇంకా రాలేదు. ముందు దానిని పంపండి. ఆ తరువాత మాట్లాడండి? మేం కొనడానికి అభ్యంతరం లేదు.. గత సంవత్సరం యాసంగిలో ఎంత బియ్యం ఇస్తామన్నారు? ఎంత ఇచ్చారు? దానికి సమాధానం చెప్పండి? అని పీయూష్ గోయల్ నేరుగా కేకేను అడిగారు. దానికి కేకే నుంచి సమాధానం లేదు. 29 లక్షల రైస్‌లో 17 లక్షల బాయిల్డ్ రైస్ కేంద్రానికి పంపలేదు?ఎందుకు అని నిలదీశారు. గత సంవత్సరం బియ్యం ఇంకా పెండింగ్ ఉంది. మరి వచ్చే సంవత్సరం గురించి క్లారిటీ కావలంటున్నారు. ఇదేం పద్ధతని ప్రశ్నించారు.
పీయూష్ అడిగిన ఈ ప్రశ్నకు కేకే సమాధానం చెబుతూ.. మీరు చెప్పిందే చెప్పి తికమక చేస్తున్నారు.. కానీ సరైన సమాధానం ఇవ్వడం లేదని అన్నారు. ఆ తరువాత కారుపార్టీ సభ్యులు బయటకు వచ్చి మీడియాతో తమ అక్కసు వెళ్లగక్కారు. ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని అని అడిగారే తప్ప.. పీయూష్ అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉండగా కేంద్రం అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఆన్సర్ ఇవ్వడం లేదు. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు?