ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి చెందిన నాయకుల పేర్లు సంక్షేమ పథకాలకు పెట్టడం సాధారణమే. అనేక సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు చంద్రన్న బీమా, పసుపు..కుంకుమ లాంటి పథకాలు ప్రవేశపెడితే వైఎస్ఆర్ అధికారంలో ఉన్నపుడు రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పేర్లుపెట్టారు. ఇప్పుడు వైఎస్పీ అధికారంలో ఉంది. అందుకే అక్కడ వైఎస్ఆర్పేరు లేదా జగన్ పేరుతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దాదాపు అన్ని పథకాలు ఈ ఇద్దరిలో ఎవరో ఒకరివి పేర్లుంటాయి. దీనినెవరూ కాదనలేదు.. కాదనరు కూడా.. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఇష్టం. అయితే ఇపుడు ఏపీలో సర్కారుకు ఓ చిక్కొచ్చి పడింది.
కేంద్రం ఈ విషయంపై ఘాటుగా స్పందించింది. మేం (కేంద్ర ప్రభుత్వం) అమలు చేస్తున్న పథకాలకు మీపేరు (వైఎస్ఆర్/ జగన్) పెట్టుకోవడమేమిటి అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేర్లు మార్చి మీరు ఎందుకు వేరే పేర్లు పెట్టారని.. దీనికి వివరణ ఇవ్వాలని కోరింది. వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత 2019 నుంచి సంక్షేమప పథకాలకు తండ్రి వైఎస్ఆర్ పేర్లు లేదా జగనన్న పెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐసీడీఎస్, ఐసీపీఎస్ స్కీ్మ్స్ కు కూడా జగనన్న గోరు ముద్ద, జగనన్న పాలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ తదితర నామకరణాలు చేయడంతో బీజేపీ సర్కారుకు నచ్చలేదు. ఎందుకంటే ఈ పథకాలను కేంద్రం తన సొంత నిధులతో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి ఉపయోగిస్తోంది. మేం డబ్బులిస్తుంటే వాటికి మీ పేర్లు పెట్టుకోవడం ఏమిటని తూలనాడింది. దీనికి పూర్తి వివరణ ఇవ్వాలని సర్కారును కోరింది. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.