రాళ్లేసిన ప్రాంతంలోనే.. పూలు వేయించుకున్న ఈటల

ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేసి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మంత్రిగా పనిచేసి.. ఆ తరువాత అధినేత కేసీఆర్ తో విభేదాలొచ్చి పార్టీలోంచి బయటకు వచ్చారు. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ ఈటలను ఒంటరి చేయాలని చూసింది. పార్టీలో ఉన్నపుడు మంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం.. ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విచిత్రమేమంటే ఆయన అలా రాజీనామా చేసిన కొద్ది సేపటికే స్పీకర్ ఆమోదించడం. దీంతో ఈటల అంటే టీఆర్ఎస్ పార్టీ అధినేతకు ఎంత కోపమో అర్థమవుతోంది. ఇదే ఈటలకు వరంగా మారిందని పరిశీలకులు భావిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా తనకు అండగా నిలిచిన హుజూరాబాద్ లో మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీలో చేరి పాదయాత్ర చేసి నియోజకవర్గం మొత్తం కలియతిరిగారు. అస్వస్థతకు గురైనా కోలుకొని మొక్కవోని దీక్షతో జనం మనసు గెలుచుకున్నారు. నిజం చెప్పాలంటే ఈటల ఒంటరిగా పోరాడారు. ఏకంగా ఓ సీఎంనే ఢీకొన్నారు. చివరకు విజయం సాధించి ఏ అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందో.. అక్కడే విజయగర్వంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని ప్లాన్ వేసింది. అవకాశమున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. దళితబంధును నమ్ముకుంది.. అయినా జనం కేసీఆర్ ను నమ్మలేదు. దళితబంధు ప్రకటించినా డబ్బు తమ చేతుల్లోకి రాకపోవడంతో దళితుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇదీ కూడా దళితముఖ్యమంత్రి లాంటిదే అని ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి. బీసీ, ఓసీలు కూడా గులాబి పార్టీకి వ్యతిరేకంగానే ఓట్లేశారు. దీంతో తమ సీటు బీజేపీ జాబితాలో చేరిపోయింది. దీనిని బట్టి పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. జనం చూస్తున్నారు.. పనితీరు గమనిస్తున్నారు.. తీర్పు చెప్పాల్సిన సమయంలో కరెక్ట్ జడ్జ్ మెంట్ ఇస్తున్నారు. అదీ విషయం.