త్రివిక్రమ్ పేరిట వచ్చినవన్నీ ఫేక్ పోస్ట్ లే.. నిర్మాతల క్లారిటీ..!

ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సవరణ బిల్లు ప్రకారం ప్రభుత్వమే ఇకపై సినిమా టికెట్లను ఆన్ లైన్ టికెటింగ్ విధానం ద్వారా విక్రయించనుంది. ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో లను రద్దు చేయడమే కాకుండా సినిమా టిక్కెట్ ధరలను కూడా తగ్గించింది. సినిమా విడుదలైన కొత్తలో ధర పెంచుకొని టికెట్లను విక్రయించుకునే సౌలభ్యాన్ని కూడా తొలగించింది. దీనిపై తెలుగు ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పునరాలోచించాలని కోరారు.

కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై హారిక, హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు ఒక క్లారిటీ ఇచ్చారు. సినిమా టికెట్ ధర పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో త్రివిక్రమ్ ఎటువంటి పోస్టులు చేయలేదని స్పష్టం చేశారు. త్రివిక్రమ్ పేరిట వచ్చిన పోస్టులు అన్నీ ఫేక్ అని తెలిపారు.

ప్రస్తుతం తమ సంస్థ నుంచి వస్తున్న సినిమాలో త్రివిక్రమ్ పనిచేస్తున్నారని.. ఒకవేళ తమకు సంబంధించి ఏవైనా పోస్టులు చేసినా.. అవి తమ బ్యానర్ నుంచే వస్తాయని క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ కు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవని, ఒకవేళ ఎవరైనా త్రివిక్రమ్ ఫోటో పెట్టుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే.. ఆ పోస్టులకు త్రివిక్రమ్ కు ఎటువంటి సంబంధం లేదని హారిక హాసిని వారు ఏపీ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిల హ్యాండిల్స్ ను ట్యాగ్ చేశారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్ లైన్ టికెటింగ్ విధానం, టికెట్ల ధర తగ్గింపుపై నిర్మాతలు, నటీనటులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest