టాలీవుడ్ హీరోలపై వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు..!

నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టాలీవుడ్ హీరోలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమలోని కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి, తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ముందుకు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానం వల్ల హీరోలు గా ఎదిగిన వారు వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ప్రజల సినిమాలు చూడటం వల్లే హీరోలు కోట్లు సంపాదిస్తున్నారని, వారు కష్టాల్లో ఉంటే డబ్బు ఖర్చు పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించిన సమయంలో జోలె పట్టి రోడ్డు మీదికి వచ్చి విరాళాలు సేకరించి ప్రజలకు సాయం చేశారని గుర్తు చేశారు.

తెలుగు హీరోలు వరద బాధితుల గురించి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు. ఇకనైనా హీరోలంతా కలిసి వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు. నిర్మాతలు డైరెక్టర్లు కూడా స్పందించాలని విన్నవించారు. తాజాగా టాలీవుడ్ హీరోలపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి.