టీడీపీలో కేశినేని నిర్వేదం…ఆ పార్టీ వైపు చూపు..?

కేశినేని నాని విజ‌య‌వాడ ఎంపీ… ముక్కుసూటి త‌నానికి మారుపేరు. కేశినేని ట్రావెల్స్ అధినేత‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాని 2009లో ప్ర‌జారాజ్యం పార్టీ ద్వారా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ పార్టీలో చేరిన కొద్ది రోజుల‌కే బ‌య‌ట‌కు వ‌చ్చిన నాని చంద్ర‌బాబు హామీతో గ‌త ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే ఎంపీ సీటుపై హామీ పొందారు. చంద్ర‌బాబు పాద‌యాత్ర‌లో ఖ‌ర్చంతా భ‌రించ‌డంతో పాటు పార్టీకి ఆర్థికంగా మేళ్లు చేసిన ఆయ‌న‌కు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన‌ట్టుగానే విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇచ్చారు.

వాస్త‌వంగా చెప్పాలంటే గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ఎంపీ సీటు కోసం ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త పీవీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఒకానొక‌ద‌శ‌లో నానిని పెన‌మ‌లూరు అసెంబ్లీకి పోటీ చేయ‌మ‌ని ఒత్తిడి చేశారు. అయినా ఆయ‌న వెన‌క్క‌తగ్గ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు చంద్ర‌బాబు నానికే విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇవ్వ‌డం, ఆయ‌న గెల‌వ‌డం జ‌రిగాయి. ఎంపీగా గెలిచిన నాని ఈ మూడేళ్ల‌లో ఆయ‌న త‌న‌వంతుగా అభివృద్ధి చేయ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్నారు. మంచి పేరే తెచ్చుకున్నారు.

ఆయ‌న ముక్కుసూటి త‌నంతో మాత్రం చంద్ర‌బాబును, పార్టీని మాత్రం ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. త‌న కేశినేని ట్రావెల్స్‌ను ఆయ‌న మూసేశారు. చంద్ర‌బాబుతో విబేధాల‌తోనే ఆయ‌న ఇలా చేసిన‌ట్టు టాక్‌. ఇక గ‌తంలో ఓసారి ఓపెన్‌గానే మంత్రి దేవినేని ఉమా తీరును దుయ్య‌బ‌ట్టి పెద్ద క‌ల‌క‌లం రేపారు. కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో నాని లాంటి వ్య‌క్తిని కంట్రోల్ చేయ‌లేక ఇబ్బంది ప‌డుతోన్న చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నికల్లో ఆయ‌న‌కు మ‌రో ప‌ద‌వి పేరుతో త‌ప్పించేస్తార‌ని స‌మాచారం.

ఈ విష‌యం నానికి కూడా తెలియ‌డంతో ఆయ‌న పార్టీలో తీవ్ర నిర్వేదంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. నాని మాత్రం త‌న‌కు మ‌రో ఆప్ష‌న్ వ‌ద్ద‌ని మ‌రోసారి విజ‌య‌వాడ ఎంపీగానే పోటీ చేస్తాన‌ని, ఈ విష‌యంలో వెన‌క్కు త‌గ్గేది లేద‌ని తెగేసి చెపుతున్నార‌ట‌.

బీజేపీ వైపు చూపు..

టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న కేశినేని నాని బీజేపీ వైపు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ మ‌ధ్య పొత్తు బ్రేక‌ప్‌పై వార్తలు వ‌స్తున్నాయి. ఒక‌వేళ వైసీపీ-బీజేపీ క‌లిస్తే అప్పుడు బీజేపీ ఏపీలో 10 ఎంపీ సీట్ల‌లో పోటీ చేస్తుంద‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే నాని బీజేపీ కోటాలో విజ‌య‌వాడ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని ప్లాన్‌తో ఉన్న‌ట్టు కూడా స‌మాచారం. ఏదేమైనా టీడీపీలో నాని ఇమ‌డ‌లేక‌పోతున్నార‌న్న‌ది మాత్రం వాస్త‌వ‌మ‌నే విజ‌య‌వాడ పాలిటిక్స్‌లో జ‌రుగుతోన్న చ‌ర్చ‌.