కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ క‌ల నిజం అవుతుందా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు స‌ప‌రేట్ ఇమేజ్ ఉంది. టీ కాంగ్రెస్‌లో ఉన్న ఈ బ్ర‌ద‌ర్స్ దూకుడు రాజ‌కీయాలు చేయ‌డంలో దిట్ట‌. తెలంగాణ‌లో కేసీఆర్ తిరుగులేని విజ‌యాలు సాధిస్తోన్న వేళ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి న‌ల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌న సోద‌రుడు మాజీ ఎంపీ రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయించి భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు.

కేసీఆర్ మీద స‌వాల్ చేసి మరీ ఈ బ్ర‌ద‌ర్స్ గెలిచారు. ఇదిలా ఉంటే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు చాలా రోజులుగా టీ కాంగ్రెస్‌కు సార‌థ్యం వ‌హించాల‌న్న క‌ల మెండుగా ఉంది. ఒకే పార్టీలో ఉన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ పార్టీకి చెందిన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు బద్ధ శత్రువులు. ఉత్త‌మ్‌పై విమ‌ర్శ‌లు చేసే విష‌యంలో కోమ‌టిరెడ్డి సోద‌రులు ఏ మాత్రం వెనుకాడ‌రు.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగా ఏదోలా ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ప‌ద‌వి ఊడ‌బెరికి టీ పీసీసీ చీఫ్ సీటులోకి తాను ఎంట‌ర్ అయిపోవాల‌ని కోమ‌టిరెడ్డి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. యేడాది కాలంగా టీ పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం ఆయ‌న చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు..ప‌న్న‌ని వ్యూహం లేదు. త‌న‌కు టీ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని వెంక‌ట‌రెడ్డి ఎప్పటి నుంచో హైకమాండ్‌ను కోరుతున్నారు.

ఈ విషయంలో అధిష్టానం నుంచి వారికి ఎలాంటి హామీ రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా అక్టోబ‌ర్‌లో టీ పీసీసీ చీఫ్ మార‌తాడ‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మీడియా మిత్రుల‌కు చెప్ప‌డంతో ఇది నిజ‌మేనా అని టీ కాంగ్రెస్ శ్రేణులు ఆరాలు పేరాలు తీస్తున్నాయి. మ‌రి టీ పీసీసీ చీఫ్ ప‌ద‌వి ద‌క్కించుకుని, వ‌చ్చే ఎన్నిక‌ల వేళ సీఎం రేసులో ఉండాల‌ని కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? చూడాలి.