బాబుపై జ‌య‌దేవ్ తీవ్ర అసంతృప్తి… కారణం ఏంటి!

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చిత్తూరు జిల్లాలో బ‌లంగా ఉన్న గ‌ల్లా ఫ్యామిలీ ఎన్నో ఆశ‌ల‌తో కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం తెంచుకుని సైకిలెక్కేసింది. నాడు టీడీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఎవ్వ‌రూ లేక‌పోవ‌డంతో చంద్ర‌బాబు కూడా గ‌ల్లా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్ వేసి మ‌రీ పార్టీలో చేర్చుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న గ‌ల్లా అరుణ‌కుమారికి చంద్ర‌గిరి అసెంబ్లీ సీటుతో పాటు గ‌ల్లా జ‌య‌దేవ్‌కు గుంటూరు లోక్‌స‌భ సీటు ఇచ్చారు.

గుంటూరు నుంచి జ‌య‌దేవ్ 90 వేల ఓట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధిస్తే చంద్ర‌గిరిలో మాత్రం గ‌ల్లా అరుణ ఓడిపోయారు. జ‌య‌దేవ్ గెలుపున‌కు మ‌హేష్ సోష‌ల్ మీడియాలో త‌న‌వంతుగా ప్ర‌చారం కూడా చేశాడు. గ‌ల్లా అరుణ చంద్ర‌గిరిలో ఓడిపోయినా కొద్ది రోజులు మాత్రం పార్టీలో బాగానే హ‌డావిడి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల టైంలో ఆమెకు ఎమ్మెల్సీ వ‌స్తుంద‌ని అరుణ‌, జ‌య‌దేవ్ భావించారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ప‌య్యావుల కేశ‌వ్‌, గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు లాంటి వాళ్ల‌కు ఎమ్మెల్సీ ఇచ్చిన చంద్ర‌బాబు అరుణ విష‌యానికి వ‌చ్చే స‌రికి మీకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇచ్చా క‌దా అని చెప్ప‌డంతో ఈ త‌ల్లికొడుకులు ఇద్ద‌రూ తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యారు.

ఇక ఇటీవ‌ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు లోక్‌స‌భ సీటుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కోడలు నారా బ్రాహ్మ‌ణి పేరు విన‌ప‌డుతోంది. జ‌య‌దేవ్‌తో చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ్రాహ్మ‌ణి కోసం గుంటూరు సీటును వ‌దులుకోవాల‌ని జ‌య‌దేవ్‌కు చంద్ర‌గిరి అసెంబ్లీ సీటు లేదా ఎన్నిక‌ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు పంపుతాన‌ని చెప్పార‌ట‌.

బ్రాహ్మ‌ణి కోసం త‌న సీటును వ‌దులుకునేందుకు జ‌య‌దేవ్ సిద్ధ‌ప‌డినా ఆయ‌న‌కు ఫ్యూచ‌ర్‌పై చంద్ర‌బాబు గ‌ట్టి న‌మ్మకం క‌లిగించేలా హామీ ఇవ్వ‌కపోవ‌డం, త‌న త‌ల్లి అరుణ‌కు ఎమ్మెల్సీ సీటుపై ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో జ‌య‌దేవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా గ‌ల్లా అరుణ ఫ్యామిలీకి పార్టీలో చేరినప్పుడు ఉన్న ప్రాధాన్య‌త ఇప్పుడు లేద‌న్న‌ది తేట‌తెల్ల‌మ‌వుతోంది.