ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొస్తే ఏపీ, తెలంగాణ‌లో గెలుపెవ‌రిది…

ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉండ‌గానే.. ఇప్ప‌టినుంచే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ఇటు టీడీపీ, అటు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశాయి. కొత్త‌గా రాజ‌కీయ తెర‌పై భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకోవాల‌ని నిర్ణ‌యించిన జ‌న‌సేన.. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాంటి ప్ర‌భావం చూపుతుంది? సీఎం కావాల‌నుకునే ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు ఈసారి నెర‌వేర‌తాయా? అటు టీఆర్ఎస్‌లో మ‌ళ్లీ బ‌లం పుంజుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న కాంగ్రెస్ ఆశ‌లు ఎంత‌వ‌ర‌కూ ఫ‌లిస్తాయి? అనే ప్ర‌శ్న‌లు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రికి ప్ర‌జ‌లు ప‌ట్టంకడ‌తార‌నే అంశంపై షాకింగ్ ఫ‌లితాలు మీకోసం..

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ-బీజేపీ కూటమికి 47 శాతం ఓట్లు వస్తాయట. ఇక ఈసారి కూడా ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ఆశ‌లు అడియాశ‌ల‌వ్వాల్సిందేన‌ట‌. ఎందుకంటే ప్రతిపక్ష వైసీపీ 40 శాతం ఓట్లతో.. ఈసారీ ప్రతిపక్షంతోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని శుక్రవారం విడుదలైన `వీడీపీ అసోసియేట్స్‌` సర్వే గణాంకాలు తేల్చిచెప్పాయి. ఒంటరి పోరుకు ఏర్పాట్లు చేసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ జనసేన పార్టీ మూడు శాతం ఓట్లు సాధించనుందని సర్వే చెబుతోంది. రాష్ట్ర విభజనతో ఏపీలో అథఃపాతాళానికి చేరిన కాంగ్రెస్‌ ఏ మాత్రం పుంజుకోలేద‌ట‌. కేవలం మూడు శాతం ఓట్లతో అట్టడుగున నిలిచింది.

అయితే… ఆంధ్రప్రదేశ్‌లో ఎటూ తేల్చుకోలేని ఓటర్లు ఏడు శాతం మంది ఉన్నారు. వీళ్లంతా ఎటువైపు మొగ్గు చూపుతారు? వీళ్లంతా ఒకవైపే ఉంటారా? చీలుతారా అన్న విషయాన్ని బట్టి కూడా పార్టీల జయాపజయాలు ఆధారపడతాయి. ఇక తెలంగాణ‌లోనూ కారు జోరుకు ఎదురులేద‌ట‌. అధికారానికి వచ్చి మూడేళ్లయిన తర్వాత కూడా తెలంగాణలో టీఆర్‌ఎస్ హ‌వా కొనసాగుతోంది. జ‌నాక‌ర్ష‌క ప‌థ‌కాల‌తో అన్ని వ‌ర్గాల‌నూ ఆక‌ట్టుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తెలంగాణ‌లో ఆ పార్టీకి 47 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. ఇక శ‌త‌విధాలా పున‌ర్జీవం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌కు.. ఈ సారి కేవ‌లం 23 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని వెల్ల‌డైంది.

బీజేపీ-టీడీపీ కూటమి 14+5 శాతం ఓట్లతో అధికార పార్టీకి ఏ మాత్రం పోటీ ఇవ్వలేనంత దూరంలో ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎంకు, ఇతర పార్టీలకు కలిపి ఏడు శాతం మంది మద్దతిస్తున్నారు. ఎటూ తేల్చుకోలేని ఓటర్లు నాలుగు శాతం వరకూ ఉన్నారు. ఇక‌ తమిళనాట అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి కష్టకాలం ముంచుకు వచ్చిందని సర్వే చెబుతోంది. కూటమికి 33 శాతం ఓట్లు వస్తే అందులో 9 శాతం బీజేపీ ఓట్లే. డీఎంకే, కాంగ్రెస్‌ కూటమికి 37 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులకు 14 శాతం ఓట్లు దక్కాయి. దాంతో తమిళనాడు పోరు రసవత్తరం కానుంది. ఇక క‌ర్ణాట‌క‌లోనూ బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది.