ఇప్పుడు చంద్ర‌బాబు టార్గెట్ వాళ్లేనా

అసంతృప్తి.. టీడీపీలో ఈమ‌ధ్య విప‌రీతంగా వినిపిస్తున్న ప‌దం!! క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేర‌యిన టీడీపీలో అసంతృప్తి వ‌ల్ల తీవ్ర అల‌జ‌డి రేగుతోంది. ముఖ్యంగా పార్టీని రాజ‌కీయంగా బ‌లోపేతం చేసేందుకు ఎంచుకున్న `ఆకర్ష్‌` వ‌ల్ల ఇది మ‌రింత తీవ్ర‌మైంది. రెండేళ్లలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో.. ఇదే అసంతృప్తి కొన‌సాగితే.. జంపింగ్‌లు ఎక్కువ‌వుతాయ‌ని దీనివ‌ల్ల‌ పార్టీకి తీవ్ర న‌ష్ట త‌ప్ప‌ద‌ని భావించిన అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ముఖ్యంగా శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలో చేర‌డంతో వెంట‌నే ఆయ‌న అల‌ర్ట్ అయ్యారు. ఇలా వ‌దిలేస్తే ఇంకా ఇవి పెరిగిపోయే ప్ర‌మాద‌ముంద‌ని గుర్తించిన ఆయ‌న‌.. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌బోతున్నారు.

ప్ర‌తిప‌క్షాన్ని దెబ్బ‌కొట్టేందుకు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఇప్పుడు టీడీపీకి ఇబ్బందులు తెచ్చింది. ప్ర‌తిప‌క్ష నేత‌ల చేరిక‌తో ఆయా నియోజక‌వ‌ర్గాల్లోని టీడీపీ నేత‌ల్లో అల‌జ‌డి మొద‌లైంది. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయ‌ని, కొద్ది రోజులు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అధినేత వారికి సూచించారు. అయితే వారు చేరి నెల‌లు గ‌డిచిపోతుండ‌టంతో.. టీడీపీ నేత‌ల్లో ఆందోళన పెరుగుతోంది. ఇదే స‌మ‌యంలో నంద్యాల ఉప ఎన్నికల పోరులో భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొన‌డం, టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో శిల్పా మోహ‌న‌రెడ్డి వైసీపీలోకి జంప్ అవ్వ‌డం తెలిసిందే! ఈ నేప‌థ్యంలో.. ఇదే ప‌రిస్థితి మిగిలిన నియోజక‌వ‌ర్గాల్లోనూ వ‌స్తుంద‌నే టెన్ష‌న్ చంద్ర‌బాబులో మొద‌లైంది.

దీంతో ఇప్పుడు పార్టీలో అసంతృప్త నాయ‌కుల‌పై చంద్ర‌బాబు ప్ర‌త్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌పై, జిల్లాల వారీగా పార్టీ వ‌ర్గాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్ట‌బోతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ముందుగా జమ్మ‌ల‌మ‌డుగుకు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు రామ‌సుబ్బారెడ్డితో చంద్ర‌బాబు స‌మావేశమ‌య్యారు! ప్ర‌తిప‌క్షం నుంచి వ‌చ్చిన ఆదినారాయ‌ణ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. ఇదే సంద‌ర్భంలో ఆ వ‌ర్గాన్ని సంతృప్తి ప‌రిచేందుకు గ‌వ‌ర్న‌ర్ కోటాలో టిక్కెట్ ఇస్తానంటూ చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అయితే, అది ఎప్ప‌టికి నెర‌వేరుతుందో అని సుబ్బారెడ్డి ఈ మ‌ధ్య అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి, అమ‌రావ‌తిలో ఆయ‌న‌తో భేటీ అయ్యారు. త‌న వ‌ర్గానికి ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వ‌క‌పోతే కార్య‌క‌ర్త‌లు స‌హించేలా లేర‌ని చంద్ర‌బాబుకు రామ‌సుబ్బారెడ్డి ఈ భేటీలో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే న్యాయం చేస్తాన‌నీ, కాస్త ఓపిగ్గా ఉండాల‌ని ఆయ‌న‌తో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇదే క్ర‌మంలో మ‌రికొంత‌మంది సీనియ‌ర్లతో చంద్ర‌బాబు భేటీ కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. మ‌రి భ‌విష్య‌త్తులో పార్టీ నుంచి జంపింగ్‌ల‌ను ఆపాలంటే ఇప్ప‌టి నుంచే ఇలాంటి వ‌న్నీ త‌ప్ప‌వు మ‌రి!! మొత్తానికి శిల్పా మోహ‌న్ రెడ్డి వైసీపీలో చేరి చంద్ర‌బాబును అల‌ర్ట్ చేశాన‌నే చెప్పుకోవాలి.