ఏపీ టీడీపీ -బీజేపీ గ్యాప్‌కు దుర్గ‌మ్మే సాక్ష్యం

మిత్రప‌క్షాల మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. రాజ‌ధాని ప్రాంతం, ఏపీకి కీల‌కమైన విజ‌య‌వాడ‌లో టీడీపీ-బీజేపీ మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైంది. 2014 ఎన్నిక‌ల నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య గ్యాప్ కొన‌సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలోనే విజ‌య‌వాడ దుర్గ‌మ్మ స‌న్నిధిలో జ‌రిగిన సంఘ‌ట‌న మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్వ‌యంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ నేత పైడికొండ‌ల మాణిక్యాల రావు… క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌య పాల‌క‌మండ‌లి ప్ర‌మాణాస్వీకారానికి గైర్హాజ‌రవ‌డం ఇప్పుడు ఏపీలో చర్చ‌నీయాంశ‌మైంది. టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య గ‌ల విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు!

గ్యాప్‌.. విభేదాలు.. అంత‌ర్గ‌త పోరు.. ఇలా పేరు ఏదైనా.. టీడీపీ-బీజేపీ మ‌ధ్య కొంత దూరం మాత్రం ఉంది. దీనిని స‌రిజేయాల‌ని అటు కేంద్ర నేత‌లు రంగంలోకి దిగినా.. ఎంత‌కీ ఇవి త‌గ్గ‌డం లేదు. తాడేప‌ల్లిగూడెంలో ఇప్ప‌టికే బీజేపీ-టీడీపీ మ‌ధ్య జ‌రుగుతున్న రచ్చ ఇరు పార్టీల నేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారింది. మరోసారి ఆయ‌న వ్య‌వ‌హారం పార్టీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నవ్యాంధ్రలో టీటీడీ తరువాత రెండో ప్రాధాన్యత కలిగిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి దేవాదాయ – ధర్మాదాయ శాఖా మంత్రి మాణిక్యాలరావు గైర్హాజరు అవడం చర్చనీయాంశమవుతోంది.

సుమారు దశాబ్ధకాలం తర్వాత‌ కనకదుర్గ ఆలయానికి పాలకమండలిని నియ‌మించారు. రాజధాని నడిబొడ్డున కనకదుర్గ ఆలయ‌ పాలకమండలి ప్రమాణ స్వీకారానికి మంత్రితోపాటు పాలక మండలిలో సభ్యునిగా ఉన్న నగర బీజేపీ నేత చైర్మన్ రేసులో ఉన్న రంగ ప్రసాద్ కూడా హాజరుకాకపోవడం టీడీపీ-బీజేపీల మధ్య అగాధం పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేష‌కులు. ఆలయంలో జరిగే ప్రధాన కార్యక్రమాలకు మంత్రి దూరంగా ఉంటున్నారా లేక మిత్రపక్షమైన టీడీపీనే దూరంగా పెట్టిందా అనే అంశంలో పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ కేంద్రంగా బీజేపీ ఎదిగితే భవిష్యత్తులో టీడీపీకి కష్టాలు తప్పవని ఆ పార్టీ నేతలు భావిస్తున్నార‌ట‌.

గతంలో విజయవాడ నగరంలో ఓ ఎమ్మెల్యే స్థానాన్ని బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో సెంట్రల్ సీటు బీజేపీకి కేటాయించాల్సి వస్తుందనే ఉద్దేశంతో అధికారపార్టీ మిత్రపక్షమైన బీజేపీని వ్యూహాత్మకంగా దూరంగా ఉంచుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీతో కేంద్ర స్థాయిలో మిత్రపక్షంగానే వ్యవహరిస్తూ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి పెద్దగా సహకరించకూడదన్న‌ అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. మ‌రి మొత్తానికి టీడీపీ-బీజేపీ వ్య‌వ‌హారం శృతి మించి రాగాన ప‌డుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.