స‌ఫ‌ల‌మైతే.. సొంత‌డ‌బ్బా.. విఫ‌ల‌మైతే విప‌క్షాల కుట్రా!

ఏపీ, తెలంగాణ స‌హా కేంద్ర ప్ర‌భుత్వాల వ్య‌వ‌హార శైలి.. వింత‌గా ఉంది! అధికారంలోకి వ‌చ్చేసి మూడేళ్లు గ‌డిచిపోయినా.. ఇంకా విప‌క్షాలు త‌మ‌పై కుట్రలు ప‌న్నుతున్నాయ‌ని పెద్ద పెద్ద విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు అధికార పార్టీల అధినేత‌లు! తాము చేప‌ట్టిన ప‌నులు విజ‌య‌వంతం అయితే అంతా త‌మ‌దే ఘ‌న‌కార్యంగాను, విఫ‌ల‌మైతే.. విప‌క్షాల కుట్ర అన‌డం ఇప్పుడు అంద‌రికీ అల‌వాటుగా మారిపోయింది. తాజాగా ఏపీ, తెలంగాణ‌, అటు కేంద్రంలో జ‌రిగిన ప‌రిణామాలు అత్యంత ఆస‌క్తిగా మారాయి.

ఏపీలో కురిసిన భారీ వ‌ర్షానికి అసెంబ్లీ లోని విప‌క్ష నేత జ‌గ‌న్ కు కేటాయించిన చాంబ‌ర్‌లో చిల్లుప‌డింది. ఇది నిర్మాణ వైఫ‌ల్యమో లేదా మ‌రోమో అయివుండొచ్చు. దీనికి ప‌రిశీలించి ప‌రిష్కారం చూస్తామ‌ని చెప్పాల్సిన ప్ర‌భుత్వం.. ఇదంతా విప‌క్ష నేత జ‌గ‌న్ కుట్ర అంటూ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఇది ఎంత హ‌స్యాస్ప‌దంగా ఉందో అంద‌రూ ఊహించుకోగ‌ల‌రు. నిజానికి అసెంబ్లీలోకి బ‌య‌టి వాళ్ల‌ని ఎవ్వ‌రినీ వెళ్ల‌నివ్వ‌రు. అలాంటిది కుట్ర‌ల‌కు ఆస్కారం ఎక్క‌డ‌?! అదేవిధంగా పోల‌వ‌రం ముందుకు సాగ‌క‌పోవ‌డానికి నిధుల స‌మ‌స్య‌, కేంద్రం నుంచి అనుమ‌తులు రాక‌పోవ‌డం వంటివి ప్ర‌ధాన స‌మ‌స్య‌లు. అయితే, దీనికి కూడా చంద్ర‌బాబు.. ఈ మ‌ధ్య జ‌గ‌న్ కుట్ర అన‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

ఇక‌, తెలంగాణ‌లో ఖ‌మ్మం మిర్చి యార్డులో మ‌ద్ద‌తు ధ‌ర‌లేక క‌డుపు మండిన రైతులు ఆందోళ‌న చేశారు. ఈ క్ర‌మంలో కొంద‌రిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసులు పెట్టి.. చేతుల‌కు ఇనుప గోలుసులు వేసి కోర్టుకు హాజ‌రుప‌రిచారు. ఇది దేశ వ్యాప్తంగా ర‌చ్చయింది. రైతుల‌కు పెద్ద పీట వేస్తామ‌ని చెప్పే.. కేసీఆర్ ప్ర‌భుత్వంఇలా రైతుల‌కు బేడీలు వేయ‌డంపై చ‌ర్చ‌కు తెర‌దీసింది. అయితే, దీనిని కూడా ప్ర‌భుత్వం విప‌క్షాల కుట్ర‌గా అబివ‌ర్ణించింది.

ఇప్పుడు తాజా ఘ‌ట‌న చూస్తే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీ స‌ర్కారు ఏకంగా త‌మ‌కు న్యాయం చేయ‌మ‌న్న రైతుల‌పై కాల్పుల‌కు తెగ‌బ‌డింది. దీంతో ఏడుగురు చ‌చ్చిపోయారు. ఇది నిజంగా దారుణం.. అయితే, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ముఖ్యంగా వెంక‌య్య‌నాయుడు వంటి వారు దీనిని కూడా విప‌క్షాల కుట్ర‌గా అభివ‌ర్ణించ‌డం గ‌మ‌నార్హం. పైకి తాము బాగానే పాలిస్తున్నా.. విప‌క్షాలు ప‌నిగ‌ట్టుకుని త‌మ‌ను బ‌ద్నాం చేస్తున్నాయ‌ని ఆయ‌న వాపోయారు. అయితే, ఇక్క‌డే అస‌లు విష‌యం తెలుస్తోంది. రైతుల‌ను కాల్చ‌మ‌ని విప‌క్షాలు చెప్పాయా? రైతుల‌కు బేడీలు వేయ‌మ‌ని విప‌క్షాలు చెప్పాయా? ఇలా ఎంత‌కాలం విప‌క్షాల కుట్ర అంటూ కాలం గ‌డుపుతారోవాళ్ల‌కే తెలియాలి. ఏదేమైనా మ‌రో రెండేళ్ల‌లో అంద‌రూ ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన వాళ్లే.. అప్ప‌డు ఎవ‌రి కుట్ర‌ల‌కు ప్ర‌జ‌లు ఎలా రియాక్ట్ అవుతారో తెలుస్తుంది!!