కాపు ఉద్య‌మాన్ని అట‌కెక్కించిన ముద్ర‌గ‌డ‌..!

ఏపీలో 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధికార టీడీపీ కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌ని, వారికి రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఆ హామీయే ప‌నిచేసిందో లేదా జ‌న‌సేన‌-ప‌వ‌న్ ఎఫెక్టే ప‌నిచేసిందో గాని కాపులంతా టీడీపీకి వ‌న్‌సైడ్‌గా ఓట్లేసి గెలిపించారు. వాస్త‌వానికి కాపులు బ‌లంగా ఉన్న జిల్లాల్లో చంద్ర‌బాబు కంటే జ‌గ‌నే ఆ సామాజిక‌వ‌ర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చినా ఓట‌ర్లు మాత్రం టీడీపీకే ప‌ట్టంగ‌ట్టారు. ఆ త‌ర్వాత రోజులు, నెల‌లు, మూడేళ్లు గ‌డ‌చిపోయాయి…ఇప్ప‌ట‌కీ కాపుల రిజ‌ర్వేష‌న్లు క‌ల‌గానే ఉన్నాయి. చంద్ర‌బాబు అదిగో ..ఇదిగో అంటున్నారే త‌ప్ప ఈ ఊసే లేదు.

ఇక యేడాది క్రితం కాపు రిజ‌ర్వేష‌న్లు, హ‌క్కుల కోసం మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు ఉద్య‌మాన్ని హోరెత్తించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టుడుకించారు. కాపు ఉద్య‌మం మ‌హోద్య‌మంగా మారింది. ఇంట్లో నిర్బంధం, పాద‌యాత్ర‌, నిరాహార దీక్ష ఇలా ఏవేవో చేశారు. కానీ ఆయ‌న ఏదీ చిత్త‌శుద్ధితో చేసిన‌ట్టు లేదు. అందుకే కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం ఒక అడుగు ముందుకు ప‌డితే ప‌ది అడుగులు వెన‌క్కి వెళ్లింది. అందుకే ముద్ర‌గ‌డ విష‌యంలో చాలా టెన్ష‌న్ ప‌డిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఇప్పుడు చాలా రిలాక్స్ అయ్యింది.

మ‌రోసారి ముద్ర‌గ‌డ కాపు ఉద్య‌మం అంటూ హ‌డావిడి చేస్తే కాపుల్లోనే స‌గం మంది బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇక దాస‌రి ముద్ర‌గ‌డ‌కు ఎంతో స‌పోర్ట్ చేశారు. ఇప్పుడు ఆయ‌న లేక‌పోవ‌డం ముద్ర‌గ‌డ‌కు, కాపు ఉద్య‌మానికి తీరనిలోటే. ఇక ముద్ర‌గ‌డ ఉద్య‌మం వెన‌క, తుని విధ్వంసం వెన‌క వైసీపీ ఉంద‌న్న ఆరోప‌ణ‌లు బ‌లంగా వ‌చ్చాయి. వీటితో పాటు ఉద్య‌మం పీక్‌స్టేజ్‌కు వెళ్లిన టైంలో ముద్ర‌గ‌డ కాడి కింద ప‌డేశారు. దీంతో కాపు ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సి కింద‌ప‌డిన‌ట్ల‌య్యింది.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్లు కూడా లేదు. ఇప్ప‌ట‌కీ అయినా కాపుల కోసం ముద్ర‌గ‌డ స్ట్రాంగ్ ఫైట్ చేయాల‌నుకుంటే రాజ‌కీయాల‌కు అతీతంగా పోరాడితే త‌ప్ప లేక‌పోతే కాపుల రిజ‌ర్వేష‌న్లు వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఆలోచించ‌డ‌మే మంచిది. కానీ ముద్ర‌గ‌డ ప్ర‌స్తుతం ఆ చిత్త‌శుద్ధి అయితే క‌న‌ప‌డ‌డం లేదు.