టీడీపీలో కోటి రూపాయ‌ల చిచ్చు…అస‌లు క‌థ ఇదే

ఏపీలో అధికార టీడీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావ‌రి జిల్లా ఒక‌టి. ఇప్పుడు ఈ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడి ఎంపిక పెద్ద స‌స్పెన్స్‌లో ప‌డింది. ఈ స‌స్పెన్స్ వెన‌క ఓ కోటి రూపాయ‌ల ఆస‌క్తిక‌ర క‌థ ఉన్న‌ట్టు జిల్లా టీడీపీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా నామ‌న రాంబాబు ఉన్నారు. ఈయ‌న హోం, ఉప ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప అనుంగు అనుచ‌రుడు. రాంబాబును జ‌డ్పీచైర్మ‌న్ చేయ‌డంలో రాజ‌ప్ప‌దే కీల‌క‌పాత్ర‌.

ఇదిలా ఉంటే ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ప్లాన్‌లో జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీలోకి జంప్ చేసేశారు. ఆయ‌న పార్టీలో చేరేట‌ప్పుడు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ఆయ‌న‌కు కేబినెట్ విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి రాలేదు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తే త‌న పోస్ట్ ఎక్క‌డ ఊస్ట్ అవుతుందోన‌ని రాజ‌ప్పే చ‌క్రం తిప్పిన‌ట్టు టాక్ కూడా ఉంది. అదే టైంలో నెహ్రూ త‌న‌యుడు న‌వీన్‌కు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తామ‌ని ఆయ‌న్ను శాంతిప‌జేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

నెహ్రూ త‌న‌యుడు న‌వీన్‌కు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాలంటే ప్ర‌స్తుతం జ‌డ్పీ చైర్మ‌న్‌గా ఉన్న నామ‌న రాంబాబును త‌ప్పించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా రాంబాబుకు జిల్లా పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించి ఆయ‌న చేత జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేయించి ఆ పోస్టును నెహ్రూ త‌న‌యుడికి ఇవ్వాల‌ని అధిష్టానం భావించింది. అయితే ఇప్పుడు ప్ర‌స్తుత జ‌డ్పీ చైర్మ‌న్ నామ‌న రాంబాబు మాత్రం జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు స‌సేమీరా అంటున్నారు. తాను జిల్లా పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు సుముఖంగానే ఉన్నా జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి వ‌దులుకునేందుకు అస్స‌లు ఒప్పుకోవ‌డం లేదు. దీంతో నెహ్రూకు మంత్రి ప‌ద‌వి రాలేదు. ఆయ‌న త‌న‌యుడికి జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి కూడా రావ‌డం లేదు.

కోటి రూపాయ‌ల మ‌త‌ల‌బు ఏంది..!

నామ‌న రాంబాబు అధిష్టానం మాట‌నే లెక్క చేయ‌క‌పోవ‌డం వెన‌క ఆస‌క్తిక‌ర క‌థ‌నం వినిపిస్తోంది. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు తూర్పుగోదావ‌రి జిల్లా టీడీపీ కార్యాల‌యం నిర్మాణం కోసం జిల్లాకు చెందిన ఓ కీల‌క వ్య‌క్తికి త‌న‌కు ప‌ద‌వి రావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన వ్య‌క్తికి ఆయ‌న కోటి రూపాయ‌లు ముట్ట చెప్పాడ‌ని టాక్‌. ప్ర‌స్తుతం పార్టీ కార్యాల‌యం నిర్మాణం జ‌ర‌గ‌లేదు. ఆ కోటి రూపాయ‌లు స‌దరు కీల‌క‌నేత‌ మింగేశాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

దీంతో ఇప్పుడు రాంబాబు ప‌ద‌వి వ‌దులుకునే విష‌యంలో ఒత్తిడి చేస్తోన్న స‌ద‌రు వ్య‌క్తికి ఆ కోటి మ్యాట‌ర్ ఎత్తి షాక్ ఇస్తున్నాడ‌ట‌. తాను జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి వ‌దులుకోవాలంటే రాష్ట్ర స్థాయిలో త‌న‌కు ఏదో ఒక కార్పొరేష‌న్ ప‌ద‌వి ఇవ్వాల‌ని, ఆ మేర‌కు జీవో రిలీజ్ చేస్తేనే తాను జ‌డ్పీచైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని రాంబాబు ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నాడ‌ట‌. దీంతో ఈ విష‌యం ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ద్ద‌కు కూడా చేరింది. ఏదేమైనా కోటి రూపాయ‌ల మ్యాట‌ర్ ప్ర‌స్తుతం జిల్లా టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.