చంద్ర‌బాబు పాల‌న‌లో మెరుపులెన్ని..? మ‌ర‌క‌లెన్ని?

ఆయ‌నొస్తారు.. అన్ని స‌మ‌స్య‌లూ తీరుస్తారు..! 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో భారీ ఎత్తున ప్ర‌సార మాధ్య‌మాల్లో మోగిపోయిన ప్ర‌చారం ఇది! ఆయ‌నొచ్చారు.. కానీ.. అన్ని స‌మ‌స్య‌లూ తీరాయా? ఇప్పుడు వెయ్యి డాల‌ర్ల ప్ర‌శ్న రాష్ట్రంలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి మొత్తంగా.. ముచ్చ‌ట‌గా.. మూడేళ్లు పూర్త‌య్యాయి. ఈ మూడేళ్ల కాలంలో బాబు పాల‌న తీరుతెన్నులు.. ఆయ‌న పాల‌న‌కు మార్కులు వంటి విష‌యాల‌పై ఓ లుక్కేద్దాం.. రంగాలా వారీగా ఏపీ సాధించిన ప్ర‌గ‌తిని ప‌రిశీలిద్దాం..

సంక్షేమం..

ఏ ప్ర‌భుత్వ‌మైనా ప్ర‌జా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఓ ర‌కంగా ఈ రంగ‌మే ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో ప్ర‌తిష్ట పెరిగేలా చేస్తుంది. బాబు ఈ రంగంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపారు. విక‌లాంగులు, వితంతువులు, సామాజిక పింఛ‌న్ల‌కు పెద్ద పీట‌వేశారు. పింఛ‌న్ల‌ను 2014లో ఉన్న‌దానికి మూడు రెట్లు పెంచారు. రేష‌న్ దుకాణాల్లో వ‌స్తువుల‌ను టైం ప్ర‌కారం అందిస్తున్నారు. ఇక‌, సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మ‌స్‌ల‌కు తోఫా పేరుతో చంద్ర‌న్న స‌రుకులు ఉచితంగా అందిస్తున్నారు. విద్యార్థుల‌కు స్కాల‌ర్ షిప్పులు కూడా ఈ కోవ‌లోవే. సో.. ఇవ‌న్నీ 70% మేర స‌జావుగానే సాగుతున్నాయ‌ని చెప్పొచ్చు. మిగిలిన 30% మాత్రం ప‌డ‌కేశాయి. దీంతో సంక్షేమ రంగంలో బాబు మార్కులు 55 దాట‌వు!!

ప్ర‌జారోగ్యం

రాష్ట్రంలో ప్ర‌జారోగ్యం పైన ప‌టారం లోన‌లొటారం మాదిరిగా ఉంది. ఈ శాఖ‌ను మిత్ర‌ప‌క్షం బీజేపీకి కేటాయించిన బాబు .. పైపైనే దీనిని చూస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ 108, 104 వంటివి న‌డుపుతున్నారు. కానీ, ఇవి అనుకున్నంత‌గా ముందుకు సాగ‌డం లేదు. పెద్ద పెద్ద న‌గ‌రాల్లోనూ ఒకే బెడ్‌పై ఇద్ద‌రు ముగ్గురు బాలింత‌లు పురుడు పోసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక‌, ఉద్యోగుల హెల్త్ కార్డుల‌పై కార్పొరేట్ ఆస్ప‌త్రులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా అడిగే నాథుడు క‌నిపించడం లేదు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఎవ‌రి ఇష్టo వారిది! ఎన్ని సంస్క‌ర‌ణ‌లు వ‌స్తున్నా.. వైద్యుల్లో మార్పు తేవ‌డంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంది. దీంతో ఈ రంగంలో బాబు విఫ‌ల‌మైన‌ట్టే. మొత్తానికి బాబుకు ఈ రంగంలో కేవ‌లం 10 మార్కులే వ‌చ్చాయి!

విద్య‌, ఉపాధి

ఈ రెండు రంగాల్లోనూ చంద్ర‌బాబు స‌ర్కారు ఆశించిన ఫ‌లితాలు రాబ‌ట్ట‌లేదు. ఉపాధి రంగంలో వేల మంది కాదుకాదు.. ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలిస్తామ‌ని చెబుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు సాకారం కాలేదు. ఏపీపీఎస్‌సీ వంటి కొద్దిపాటి సంస్థ‌ల ద్వారా కొన్ని ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసినా నిరుద్యోగుల ఆశ‌లు నేటికీ నెర‌వేర‌లేదు. అదేవిధంగా విద్యారంగంలోనూ ఆశించి ఫ‌లితాలు రాలేదు. ఉన్న‌త విద్య‌కు సంబంధించిన సంస్థ‌ల‌ను తెలంగాణ నుంచి రాబ‌ట్టుకోవ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో విద్యారంగంలోనూ ఆశించిన ప్ర‌గ‌తిలేదు. ఈ రెండు రంగాల‌కూ క‌లిపి మొత్తం 25 మార్కులే బాబు సొంత‌మ‌య్యాయి.

వ్య‌వ‌సాయం, రుణ‌మాఫీ

రాష్ట్రంలో వ్య‌వ‌సాయం అంతంత‌మాత్రంగానే సాగుతోంది. బాబు రెయిన్ గ‌న్స్ వంటి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నా రైతుల్లో ఆందోళ‌న మాత్రం పోవ‌డం లేదు. అదేస‌మ‌యంలో పోల‌వ‌రం, ప‌ట్టిసీమ అంటూ హ‌డావుడే త‌ప్ప ఇక్క‌డా మెరుగైన ఫ‌లితాలు రాలేదు. మ‌రోప‌క్క‌, తెలంగాణ ప్ర‌భుత్వం కృష్నా, గోదావ‌రి న‌దుల‌పై వివిధ ప్రాజెక్టుల‌ను క‌డుతోంది. వీటివ‌ల్ల ఏపీకి నీటి దెబ్బ ఎక్క‌వే. అయినా బాబు స‌ర్కారు కేసీఆర్‌తో మాట్లాడింది లేదు. అదేవిధంగా కృష్ణా జ‌లాల వినియోగం ఇప్ప‌టికీ ఇరు రాష్ట్రాల మ‌ధ్య వివాదంగానే ఉంది. దీనిని ప‌రిష్క‌రించే ఉద్దేశం కూడా బాబులో క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఎన్నిక‌ల హామీ అయిన రైతు రుణ‌మాఫీ ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ప‌ది వేల కోట్లు మాత్ర‌మే జ‌రిగింది. కానీ, తొలిసంవ‌త్స‌ర‌మే అన్ని రుణాలు తీరుస్తాన‌ని బాబు ఇచ్చిన హామీ నేటికీ నెర‌వేర‌లేదు. సో.. ఈ రెండు రంగాల్లోనూ బాబుకు 35 మార్కులు కూడా దాట‌లేదు.

అవినీతిలో.. మైన‌స్‌ మార్కులు!

మిగిలిన రంగాల్లో ఎలా ఉన్నా.. అవినీతిని స‌హించేది లేద‌ని చెప్పుకొంటున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో అదే అవినీతి తార స్థాయికి చేరింది. నేరుగా ప‌రిశ్ర‌మ ల శాఖ‌ల‌కు అధిప‌తులుగా ఉన్న‌వాళ్లే కోట్ల రూపాయ‌లు పోగేసుకుంటున్నారు. కొంద‌రైతే.. ఇళ్ల‌కు వెళ్లి బాకీలు వ‌సూలు చేసుకున్న‌ట్టు లంచాల‌ను చెక్కుల రూపంలోనూ రాబ‌డుతున్నారు. అది కూడా చంద్ర‌బాబు 1100 వంటి అవినీతిని ఏరి పారేయ‌డానికి పెట్టిన ఫోన్ల త‌ర్వాతే జ‌ర‌గ‌డం బాబు పాల‌న‌కు అద్దం ప‌డుతోంది. ఇక‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల‌ దందాలు, మంత్రుల కుటుంబ స‌భ్య‌లు లావాదేవీలు, పోలీసు ఉన్న‌తాధికారుల మామూళ్లు.. వంటి వి స‌రేస‌రి!! ఇలా ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు.. రాష్ట్రాన్ని అవినీతి ర‌హితం చేశాన‌ని చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంలో బాబుకు మైన‌స్ మార్కులే ప‌డ్డాయి.

మ‌హిళా సాధికార‌త‌.. ర‌క్ష‌ణ‌లో..

చంద్ర‌బాబు ఎప్పుడు ఎక్క‌డ మైకందుకున్నా.. మ‌హిళా సాధికార‌త‌పై దంచేస్తారు. త న‌ప్ర‌భుత్వ హ‌యాంలోనే మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేశామ‌ని ఆయ‌న చెప్పుకొంటారు అదేమంటే డ్వాక్రా.. ఆయుధాన్ని బ‌య‌ట‌కు తీస్తారు. మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ చేశామ‌ని చెప్పుకొంటారు. అయితే, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి డిఫ‌రెంట్‌. విజ‌య‌వాడ‌లో వెలుగుచూసిన కాల్ మ‌నీ కేసులో బాధ్యులు ఎవ‌రో ఇప్ప‌టికీ తెలియ‌లేదు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా బాలిక‌ల కిడ్నాప్‌లు పెరిగిపోయాయ‌ని ఒక్క ప్ర‌కాశంలోనే 112 కిడ్నాప్ కేసులు న‌మోద‌య్యాయ‌ని సాక్షాత్తూ డీజీపీ నిన్న చెప్ప‌డం గ‌మ‌నార్హం. అదేవిధంగా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌కు అంతుపొంతు ఉండ‌డం లేదు. ఎన్నియాప్‌లు, ఎన్ని ర‌క్ష‌క్‌లు పెట్టినా.. మార్పు క‌నిపించ‌డం లేదు. ఇదంతా కూడా బాబు మెడ‌కు చుట్టుకునేదే! సో.. ఈ విష‌యంలో ఆయ‌న‌కు కేవ‌లం 5 మార్కులు మాత్ర‌మే వ‌చ్చాయి. . ఇలా చంద్రాబాబు ప్ర‌భుత్వం అన్ని విష‌యాల్లోనూ విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. మ‌రి రాబోయే రెండే్ళ్ల‌లో అయినా పుంజుకుంటుందో లేదో చూడాలి!!