ఆ ఇద్ద‌రి భేటీతో మిత్ర‌ బంధానికి బ్రేక్ ప‌డిందా? 

ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. మిత్రులు శ‌త్రువులు అవుతున్నారు. శ‌త్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వత శ‌త్రువులు ఉండ‌ర‌నే దానికి స‌రైన నిర్వ‌చనంలా మారుతున్నాయి. కొత్త పొత్తుల‌కు రంగం సిద్ధ‌మవుతోంది. టీడీపీ-బీజేపీ నేత‌ల మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెరిగింది. ప్ర‌ధాని మోదీతో వైసీపీ అధినేత జ‌గ‌న్‌ భేటీ అనంత‌రం.. టీడీపీ, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. ప్ర‌స్తుతం అంత‌ర్గ‌తంగా ఉన్న విభేదాలు.. మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. మొత్తంగా మిత్ర బంధానికి ముగింపు ప‌లికేలా ఇరు పార్టీల నేత‌లు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిసిన వెంటనే టీడీపీ నేతలు సాక్షాత్తూ ప్రధాని మోదీపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్థిక నేరగాడైన జగన్ కు మోదీ అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారని.. మంత్రులు మొదలుకుని టీడీపీ నేతలు సమావేశాలు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. దీనిపై బీజేపీ కూడా అంతే దీటుగా స్పందించింది. ప్రధాని మోదీ ఎవరిని కలవాలో.. టీడీపీ డిసైడ్ చేయలేదని ఆ పార్టీ నాయకులు ప్రకటించినా.. టీడీపీ నేతలు మాత్రం తమ విమర్శల దాడిని ఏ మాత్రం తగ్గించటంలేదు.

ఈ పరిణామాల‌న్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీ పొత్తు చెల్లాచెదురు అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాప‌య‌ప‌డుతున్నారు. నాయ‌కులే కాక‌ శనివారం వెలగపూడిలో మీడియాతో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రధానిని కలవటం ద్వారా జగన్ ఏమి సాధించారని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే మాత్రం లోపలలోపల ఏదో జరుగుతుందని టీడీపీ నేతలు కూడా అనుమానిస్తున్నారు. కేంద్రంతో సఖ్యతతో ఉంటేనే ఏపీకి ప్రయోజనం ఉంటుందని ఇంత కాలం చెబుతూ వచ్చిన నేతలు ఏకంగా ప్రధాని మోదీ చర్యలనే ప్రశ్నించటం ద్వారా టీడీపీ పెద్ద ఛాలెంజ్ కే రెడీ అవుతోంది.

జగన్‌ను ప్రధాని మోదీని కలిసి రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు పలికినందున ఆయనకకు మద్దతుగా ఉన్న క్రిస్టియన్లు.. ముస్లిం మైనారిటీలు దూరం అవుతారని టీడీపీ కొత్తగా ఓ లాజిక్ ను తెరపైకి తెచ్చింది. అదే నిజమ‌నుకుంటే ఇప్ప‌టికే బీజేపీతో భాగస్వామిగా ఉన్న టీడీపీ వైపు వాళ్లు వ‌స్తారా అనేది కొంద‌రి ప్ర‌శ్న! కేవలం జగన్ బీజేపీతో జతకడితే.. టీడీపీకీ బీజేపీకి మ‌ధ్య దూరం పెరుగుతుంది త‌ప్ప ఎక్క‌డా సైద్ధాంతిక అంశాలు ఉండవు అక్కడ. ఇదే సమయంలో జగన్ ప్రత్యేక హోదా విషయంలో రాజీపడి.. ఏదైనా కారణాలతో గతంలో ప్రకటించినట్లు ఎంపీలతో రాజీనామా చేయించకపోతే అప్పుడు చంద్రబాబు..జగన్ కు పెద్ద తేడా లేదని ప్రజలు భావించే అవకాశముంది.