ఏపీలో ఎమ్మెల్యే సీట్ల పెంపుపై వైసీపీ యాంటీ ప్ర‌చారం

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం.. ఏపీ, తెలంగాణ‌లో అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల్సి ఉంటుంది. అంటే ప్ర‌స్తుతం ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌నే పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించి సంఖ్య‌ను పెంచ‌డం ద్వారా స‌భ‌ల‌ను బ‌లోపేతం చేయాలి. దీనిపై ఇటు ఏపీ సీఎం చంద్ర‌బాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రీ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న బీజేపీ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే, ఇక్క‌డ ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంటోంది.

ఏపీలో ఏకైక బ‌ల‌మైన విప‌క్షంగా ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పున‌ర్విభ‌జ‌న‌పై ఒకింత భ‌య‌ప‌డుతున్నార‌నే వ్యాఖ్య‌లు ఆయ‌న సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ప‌దే ప‌దే పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గ‌ద‌ని, అది సాధ్యం కాద‌ని, దీనికి రాజ్యాంగం ఒప్పుకోద‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌చారం చేశారు. ప్ర‌స్తుతం చేయిస్తున్నారు కూడా. సొంత మీడియా సాక్షిలో నెల‌కోసారి ఏదో ఒక రూపంలో దీనిపై ప్ర‌త్యేక క‌థ‌నాలు కూడా ప్ర‌సారం చేయిస్తున్నారు.

నిజానికి సీట్ల సంఖ్య పెరిగితే.. వైసీపీకి కూడా లాభ‌మే.. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేర‌కు ప్ర‌స్తుతం ఉన్న 175 స్థానాలు 225కి పెరుగుతాయి. అంటే మ‌రో 50 కొత్త సీట్లు అందుబాటులోకి వ‌స్తాయి. దీనికి ఆనందించాల్సిన జ‌గ‌న్ వాపోతున్నారంటే.. దీని వెనుక ఏముంటుంద‌నేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే ఆయ‌న పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేత‌లు వ‌ల‌స‌పోయారు. అదీకాక‌, రేపో మాపో జ‌న‌సేనాని పిలుపు నిస్తే.. జంప్ చేసేందుకు మ‌రికొంత మంది రెడీగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడున్న 175 స్థానాల‌కే అభ్య‌ర్థుల‌ను వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో 50 సీట్లు పెరిగితే అభ్య‌ర్థుల‌ను వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని జ‌గ‌న్ వాపోతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే ప్ర‌తి ప‌ది ప‌దిహేను రోజుల‌కోసారి.. పున‌ర్విభ‌జ‌న ఉండ‌ద‌ని, స్థానాలు పెర‌గ‌వ‌ని ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారు. అలా కాకుండా అంద‌రినీ ఆదిశ‌గా సిద్ధం చేస్తే బాగుంటుంద‌ని అంటున్నారు. మ‌రి అధినేత వింటారా? లేదా? చూడాలి.