తెలంగాణ‌లో వైసీపీలోకి రివ‌ర్స్ జంపింగ్‌లు

ఏపీలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ.. తెలంగాణ‌లో మ‌నుగ‌డ సాధించ‌డానికి అవ‌స్థలు ప‌డుతోంది. ఆ పార్టీకి చెందిన నాయ‌కులంతా గులాబీ కండువా క‌ప్పేసుకోవ‌డంతో నాయ‌కులు ఎవ‌రైనా ఉన్నారో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అయితే ఇప్పుడు వైసీపీలో జోష్ నింపే ప‌రిణామం జ‌రిగింది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో పార్టీనుంచి వెళ్లిపోయిన నేత‌లు.. మ‌ళ్లీ సొంత‌గూటికి వ‌స్తున్నారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ స్త‌బ్ధుగా ఉన్న వైసీపీకి కొత్త ఉత్తేజం వ‌చ్చినట్ట‌యింది. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్‌లో ఇమ‌డ‌లేక‌పోయిన వారు మ‌రికొంద‌రు బ‌య‌టికి వ‌స్తారేమో అనే సందేహాలు అందరిలోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. ఇత‌ర పార్టీల్లోని కీల‌క నేత‌లు టీఆర్ఎస్ కండువా కప్పేసుకున్నారు. ఆప‌రేష‌న్ ఆకర్ష్ దెబ్బ‌కు అన్ని పార్టీలు దాదాపుగా ఖాళీ అయిపోయాయి. ఇందులో టీడీపీ పూర్తిగా దెబ్బ‌తిన‌గా.. అంతే స్థాయిలో వైసీపీ కూడా న‌ష్ట‌పోయింది. అలా వెళ్లిన నేత‌ల‌కు రోజులు గ‌డుస్తున్న కొద్దీ త‌త్త్వం బోధ‌ప‌డుతోంద‌ట‌. పార్టీలో ఇమ‌డ‌లేక వెన‌క‌డుగు వేయ‌లేక చాలా మంది ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. దీంతో.. గులాబీ జెండా నీడకు వెళ్లిన వారంతా.. ఎవరూ అడగకుండానే స్వచ్ఛందంగా పార్టీలోకి తిరిగి వచ్చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు భీష్వ రవీందర్.. కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి లు పార్టీలోకి తిరిగి వచ్చేశారు.

తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు. పార్టీ కండువాతో వారిని పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు. దివంగత మహానేత వైఎస్ ఆశలకు.. ఆకాంక్షలకు తగ్గట్లే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని చెప్పారు. రానున్న రోజుల్లో మరింతమంది జగన్ పార్టీ నేతలు పార్టీలోకి తిరిగి వచ్చేయటం ఖాయమన్న మాటను చెప్పారు. హైదరాబాద్ శివారుకు ధర్నా చౌక్ ను తరలించాలని భావిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తునట్లు చెప్పిన గట్టు శ్రీకాంత్ రెడ్డి.. ధర్నాచౌక్ కోసం పోరాడుతున్న వారితో కలిసి నడుస్తామని.. వారితో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.

మ‌రి అసంతృప్తులంతా బ‌యటికొస్తారో లేక పార్టీలోనే అలా న‌లిగిపోతారో వేచిచూడాల్సిందే!