ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ విపక్ష నేత జగన్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసింది. ప్రభుత్వ-విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. అలాగే తెలుగు తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంతరం వైసీపీ నేతలు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. పరామర్శించడం మాని.. విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కొంత విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నేతలకు జగన్ భయం పట్టుకుందేమోననే అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరిస్తున్నారు.
ప్రధానిని ఒక రాష్ట్ర విపక్ష నేత కలవకూడదా? అంటే ఎందుకు కలవకూడదు. నిక్షేపంగా కలవొచ్చని ఎవరైనా చెబుతారు. కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మోదీని కలవాల్సిన అవసరం లేదనేంత స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన కీలక నేత కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించిన వేళలోనూ రాజకీయాల్ని వదిలకుండా విమర్శలకు దిగటాన్ని తప్పు పడుతున్నారు. పార్టీ అధినేతకు ఎంతో సన్నిహితుడైన మంత్రి నారాయణకు అంత కష్టం వస్తే.. వెళ్లి అండగా నిలవాల్సింది పోయి.. ప్రధాని మోదీతో జగన్ భేటీ మీద అనవసర విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల తీరు ఆందోళన కలిగించకమానదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తామన్న మాటకు.. తెలుగు తమ్ముళ్లు చెబుతున్న వక్రభాష్యాలు వింటే వారిని జగన్ ఫోబియో వెంటాడి వేధిస్తున్నట్లుగా ఉందని కొందరు భావిస్తున్నారు. మోదీ సడన్‌గా జగన్‌కు అపాయింట్మెంట్ ఇవ్వడం.. దాదాపు అరగంట సేపు మాట్లాడటం ఇవన్నీ చూస్తే.. టీడీపీ నేతల్లో గుబులు పుట్టిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తావిస్తూ.. అకారణంగా జగన్ పై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. మంత్రి నారాయణ కుటుంబాన్ని పరామర్శ కన్నా.. జగన్ పై విమర్శలకు ఎక్కువ సమయాన్ని కేటాయించటం ఏమిటంటూ ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రజల సమస్యల్ని ప్రధాని దృష్టికి జగన్ తీసుకెళితే.. ఏపీ అధికారపక్ష నేతలు ఎందుకంత కంగారు పడతారని జగన్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే తప్పేమిటని జగన్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్డీయేకు రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవటానికి పూర్తి బలం ఉన్న నేపథ్యంలో.. అత్యున్నత పదవి కోసం అనవసరమైన పోటీ అవసరమా? అన్న జగన్ వాదనకు మద్దతు ఇవ్వాల్సింది పోయి.. తప్పు పడుతున్న తీరు చూస్తే నిజంగానే టీడీపీ నేతల్లో ఆందోళన మొదలైందా అనే సందేహం రాక మానదు!!