పోటీకి స‌సేమిరా అంటున్న వైసీపీ నేత‌లు

క‌ర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నిక అటు టీడీపీ. ఇటు వైసీపీకి తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. ఆ సీటు త‌మ వ‌ర్గం వారికి కావాలంటే..  త‌మ వారికి కావాల‌ని మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, శిల్పా మోహ‌న్ రెడ్డి వ‌ర్గం తీవ్రంగా ప‌ట్టుబట్టాయి. ఇప్పుడు ఆ సీటు ఏ వ‌ర్గానికి కేటాయించాల‌నే అంశంపై సీఎం చంద్ర‌బాబు స‌ర్వే నిర్వ‌హిస్తున్నార‌నే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో ప‌రిస్థితి ఇలా ఉంటే.. వైసీపీలో ప‌రిస్థితి ఇంకోలా ఉంది. అభ్య‌ర్థులు ఉన్నా.. పోటీ చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదట‌. ఖ‌ర్చుకు అండ‌గా ఉంటాన‌ని అధినేత జ‌గ‌న్‌ హామీ ఇస్తున్నా.. పోటీచేసేందుకు స‌సేమిరా అంటున్నార‌ట‌.

భూమా నాగిరెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత నంద్యాలలో రాజ‌కీయ‌ పోరు మొద‌లైంది. వైసీపీ త‌ర‌ఫున గెలిచి టీడీపీలో చేరినందున‌.. అది కచ్చితంగా వైసీపీకి చెందిన సీటేన‌ని, పోటీకి అభ్య‌ర్థిని బ‌రిలోకి దించుతామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ వెంట‌నే ప్ర‌క‌టించారు. ఇక టీడీపీ కూడా ఈ ఉప ఎన్నిక‌ల‌ను సీరియస్‌గానే తీసుకుంది. దీంతో అభ్య‌ర్థులు ఎవ‌ర‌నే అంశంపై మ‌ల్ల‌గుల్లాలు మొద‌ల‌య్యాయి. భూమా అఖిల ప్రియ – శిల్పా మోహ‌న్ రెడ్డి మ‌ధ్య కాంపిటీష‌న్ బాబుకు చికాకుగా మారింది  . ఆ సీటు మాక్కావాలంటే మాక్కావాల‌న్న పోటీ నెల‌కొంది. డెసిష‌న్ బాబు కోర్టులోనే ఉంది ఇంకా.

ఇదే ఎన్నిక‌లో వైకాపా త‌ర‌పున శిల్పా మోహ‌న్‌ర రెడ్డి బ‌రిలో దిగుతార‌న్న ప్ర‌చారం సాగింది. సీటు ఇవ్వ‌ని ప‌క్షంలో ఆయ‌న వైసీపీలోకి వెళ్లిపోతార‌న్న వార్త‌లు బ‌లంగా వినిపించాయి. కానీ శిల్పా జ‌గ‌న్ పార్టీలోకి వెళ్ల‌బోవ‌డం లేద‌ని తేలిపోయింది. ఇక దీంతో నంద్యాల టిక్కెట్టుపై పోటీ చేసేందుకు ఎవ‌రున్నారు? అని జ‌గ‌న్ ఆలోచిస్తుండ‌గానే పార్టీ నంద్యాల ఇన్‌ఛార్జ్ రాజ‌గోపాల్, గంగుల బ్ర‌ద‌ర్స్‌, గౌరు వెంక‌ట రెడ్డి.. వీరిలో ఎవ‌రో ఒక‌రు పోటీ చేస్తార‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. అయితే ఇప్పుడు పోటీ చేసినా త‌మ‌కి క‌లిసొచ్చేది ఏమీ ఉండ‌ద‌ని ఆ ముగ్గురూ వెనక్కి త‌గ్గారుట‌. మ‌హా అయితే ఏడాదిన్న‌ర పాటు ప‌ద‌విలో కొన‌సాగుతాం. దాని వ‌ల్ల ఉప‌యోగం ఏం ఉంటుంద‌ని ఆ ముగ్గురు ఆలోచిస్తున్నారుట‌.

ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే కోట్లు కుమ్మ‌రించాలి. అంత పెద్ద మొత్తం త‌మ వ‌ద్ద లేనేలేదని వీరంతా చెబుతున్నారట‌. జ‌గ‌న్ స్వ‌యంగా బ‌డ్జెట్ కేటాయించి పోటీ చేయ‌మ‌న్నా.. ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదట‌. ఒక పార్టీలో అభ్య‌ర్థులు ఎవ‌రో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. మ‌రో పార్టీలో అభ్య‌ర్థులు ఉన్నా ముందుకు రాని ప‌రిస్థితి!!