నంద్యాల టీడీపీ సీటుపై తీవ్ర గందరగోళం

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరిక‌తో మొద‌లైన విభేదాలు.. ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత కూడా చ‌ల్లార‌డం లేదు. భూమా హ‌ఠాన్మ‌ర‌ణంతో అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక ఇప్పుడు టీడీపీ అధిష్ఠానానికి త‌లనొప్పులు తీసుకొస్తోంది. భూమా, శిల్పా వ‌ర్గాల మ‌ధ్య విభేదాలతో తీవ్రంగా న‌లిగిపోయిన అధినేత చంద్ర‌బాబు.. చివ‌ర‌కు వీటిని స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఉప ఎన్నిక‌ల్లో శిల్పా మోహ‌న్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో ఇప్పుడు స‌రికొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. ముఖ్యంగా శిల్పా వ‌ర్గానికి టికెట్ ఇవ్వ‌డాన్ని ఫ‌రూక్ వ‌ర్గం తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది.

నంద్యాల రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఉప ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని టీడీపీ కృత నిశ్చ‌యంతో ఉండ‌గా.. ఇప్పుడు ఆ పార్టీకి కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ్డాయి. ప్ర‌స్తుతం శిల్పా వ‌ర్గానికి ప్రాధాన్యం పెరుగుతున్న త‌రుణంలో తెర‌పైకి మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత ఎన్ ఎండీ ఫ‌రూక్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. శిల్పామోహ‌న్ రెడ్డికి ఇస్తే.. ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పోటీ చేస్తామ‌ని ఫ‌రూక్ వ‌ర్గానికి చెందిన నేత‌లు చంద్ర‌బాబుకు హెచ్చ‌రిక‌లు పంపుతున్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసిన ఎన్‌ఎండీ ఫరూ క్‌ను టీడీపీ అధినాయకత్వం గుర్తించడం లేదంటూ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. పార్లమెంట్‌ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఆర్థికంగా కూడా ఫరూక్‌ తీవ్రంగా నష్టపోయారని, అయి తే నామినెటెడ్‌ పదవుల విషయంలో ఫరూక్‌ను గుర్తించకపోవడం అన్యాయమని ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. భూమా నాగిరెడ్గి హఠ్మారణంతో ఉప ఎన్నికలు త్వరలో జరుగుతున్నందున భూమా కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

తమకే టికెట్‌ వస్తుందని శిల్పా వర్గం ప్రచారం చేసుకుంటున్న త‌రుణంలో ఫ‌రూక్ వ‌ర్గం ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం పార్టీలో తీవ్ర గంద‌ర‌గోళం సృష్టిస్తోంది. టికెట్‌ భూమా కుటుంబానికి కాకుండా శిల్పా మోహన్‌రెడ్డికి ఇస్తే తామంతా వ్యతిరేకంగా పని చేసి ఓడిస్తామని నాయకులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి నంద్యాల ఉప ఎన్నిక చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌నొప్పిగా మారుతుంద‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు.