టీడీపీలోకి మాజీ సీఎం సోద‌రుడు..?

తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్య‌తిరేకించిన, స‌మైక్యాంధ్ర చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ళ్లీ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నారు. జై స‌మైక్యాంధ్ర పార్టీని స్థాపించిన ఆయ‌న‌.. త్వ‌ర‌లో ఏదో ఒక పార్టీలో చేరిపోతారనే ప్ర‌చారం జోరందుకుంది. ఆ మాటెలా ఉన్నా.. ఆయ‌న త‌మ్ముడు న‌ల్లారి కిషోర్‌కుమార్‌ మాత్రం సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మ‌య్యారు. అతి త్వ‌ర‌లోనే ప‌సుపు కండువా క‌ప్పుకోబోతున్నారు. ఆయ‌న చేరిక‌కు టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం.

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్దమైంది. 2014 సార్వత్రిక ఎన్నికలలో `జై సమైఖ్యాంధ్ర` పార్టీ తరఫున పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి మూడేళ్లుగా నల్లారి సోదరులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వాళ్లు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతారనే వదంతులు వినిపించాయి. ఇంతలో నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ ప్ర‌య‌త్నాల‌కు ఫుల్ స్టాప్ పెట్టారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల టీడీపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమరనాథ‌రెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణ, జడ్పీ చైర్మెన్‌ గీర్వాణీ చంద్రప్రకాష్‌ తదితరులు ఆదివారం సాయంత్రం నగిరిపల్లిలో నల్లారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డిని వారు పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే కిషోర్‌కుమార్‌రెడ్డి సైతం టీడీపీలో చేరాలని ఆసక్తి చూపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

తాను పార్టీలో చేరుతానని కానీ తనకు రాజంపేట ఎంపీ టికెట్‌తో పాటు, టీటీడీ చైర్మన్‌ పదవి అడిగినట్లు సమాచారం. ఎంపీ టికెట్‌ ఇవ్వడానికి చంద్ర‌బాబు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా తన సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంపై అన్న కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా ఓకే చెప్పిన‌ట్లు సమాచారం. మ‌రి త‌మ్ముడి బాట‌లోనే అన్న కూడా త్వ‌ర‌లోనే టీడీపీలో చేరిపోతారేమో వేచిచూడాల్సిందే!!