బాబు ఇది అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ కాదా..!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి ఇమేజ్ పెంచేందుకు సీఎం చంద్ర‌బాబు ఎంతో శ్ర‌మిస్తున్నారు. పెట్టుబ‌డులు రావాలంటే కంపెనీలు ముఖ్యం క‌నుక‌.. నిత్యం పారిశ్రామిక వేత్త‌ల‌తో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంత క‌ష్ట‌ప‌డుతున్నా ఇమేజ్ క‌న్నా డ్యామేజ్ ఎక్కువ‌గా జ‌రుగుతోంది. వ‌రుస‌గా కంపెనీలు ఏపీకి క్యూ క‌ట్టడం మాని.. మూసివేసే స్థితికి చేరుతున్నాయి. మొన్న ఎయిర్ కోస్టా. నిన్న కేశినేని ట్రావెల్స్.. ఇలా వ‌రుస‌గా అన్ని కంపెనీలు టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మూడేళ్ల‌లో మూసేయ‌డం.. అమ‌రావ‌తి ఇమేజ్‌కు డ్యామేజ్ చేసే అంశాల‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కొత్త రాజధాని అంటే సహజంగా అక్కడ వ్యాపారం పెరుగుతుంది. కొత్త అవకాశాలు అందివస్తాయి. ప్రస్తుతం చంద్రబాబు వచ్చాక కొత్త ఉద్యోగాల కల్పన సంగతి ఎలా ఉన్నా…ఉన్న కంపెనీలు మాత్రం మూతపడుతున్నాయి. అదీ తెలుగుదేశం పార్టీ నేతలు..ఆ పార్టీకి సన్నిహితులవి కావటం చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా విజయవాడ కేంద్రంగా సాగుతున్న పరిణామాలు టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎల్ఈపీఎల్ సంస్థ ప్రమోటర్లు విజయవాడ కేంద్రంగా విమానయాన సంస్థను నెలకొల్పి తెలుగు ప్రజల కీర్తిని గగనతలానికి తీసుకెళ్లారని అందరూ సంతోషిస్తున్న సమయంలో ‘ఎయిర్ కోస్టా’ విమాన సర్వీసులు నిరవధికంగా నిలిచిపోయాయి.

ఈ సంస్థ మూతపడినట్లే పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విశేషం ఏమిటంటే రాజధాని రాకతో విజయవాడ విమానాశ్రయానికి ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల ప్రగతిలో రికార్డులు నమోదు చేస్తున్నా..ఇక్కడ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఎయిర్ కోస్టా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం చంద్రబాబు విజయవాడ కరకట్ట ఒడ్డున ఉంటున్న నివాసం ఎయిర్ కోస్టా ప్రమోటర్లకు చెందిన కుటుంబ సభ్యులదే. ఇదిలా ఉంటే ఎల్ ఈపీల్ గ్రూప్ మలేషియాకు చెందిన ఇసోమెరిక్ హోల్డింగ్స్ తో కలసి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వద్ద ఎల్ ఎన్ జీ ప్రాజెక్టు చేపట్టడానికి ఎంవోయు చేసుకుంది. ఇప్పుడు దీని భవిష్యత్ ఏమిటో అగమ్యగోచరంగా మారనుంది.

ఇక ఇప్పుడు టీడీపీ ఎంపీ కేశినేని నాని.. తన కేశినేని ట్రావెల్స్ ను మూసివేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. దీంతో వందల బస్సులు ఎక్కడిక‌క్కడే ఆగిపోయాయి. ఎన్నో ఏళ్ల‌ నుంచి ట్రావెల్స్ రంగంలో ఉన్న కేశినేని ఎంపీగా ఉన్నప్పుడు, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మూతపడటం విశేషం. కొత్త ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో రాకపోగా.. ఉన్న ఉద్యోగాలు పోవటం రాజధాని బ్రాండ్ ఇమేజ్ కు దెబ్బ అని పరిశ్రమ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.