ప‌రిటాల సునీత‌కు ముందు నుయ్యి…వెన‌క గొయ్యి..!

ఏపీలో అనంత‌పురం జిల్లా పేరు చెప్ప‌గానే మ‌న‌కు ప‌రిటాల ఫ్యామిలీ గుర్తుకు వ‌స్తుంది. ఆ జిల్లా రాజ‌కీయాల్లో ఆ ఫ్యామిలీకి అంత‌లా బ‌ల‌మైన ముద్ర వేసింది. దివంగ‌త మాజీ మంత్రి ప‌రిటాల ర‌వీంద్ర ఒక్క అనంత‌పురం జిల్లాలోనే కాదు ఏపీ, తెలంగాణ‌లో కూడా క్రేజ్ ఉన్న లీడ‌ర్ అయ్యాడు. ప‌రిటాల ర‌వి హ‌త్యానంత‌రం ఆయ‌న వార‌సురాలిగా ర‌వి భార్య సునీత రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సునీత కూడా మూడుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు.

చంద్ర‌బాబు ప‌రిటాల ఫ్యామిలీ త్యాగాల‌ను గుర్తించి ఆమెకు త‌న కేబినెట్‌లో 2014 లో కీల‌క‌మైన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖా మంత్రి బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టాడు. అయితే రాను రాను చంద్ర‌బాబు ఆమెకు ప్రయారిటీ త‌గ్గిస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. తాజాగా జ‌రిగిన కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో ఆమె చేతిలో ఉన్న కీల‌క‌మైన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ త‌ప్పించేసి ఆమెకు అంత‌గా ప్రాధాన్యం లేని మహిళా సాధికారత, శిశు సంక్షేమం, వికలాంగ, వృద్ధుల సంక్షేమం అప్ప‌గించారు.

ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో సునీత త‌న కుమారుడు శ్రీరామ్‌ను కూడా పొలిటిక‌ల్ ఎంట్రీ చేయించాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె తన‌తో పాటు శ్రీరామ్‌కు కూడా ఎమ్మెల్యే టిక్కెట్టు సాధించాల‌నే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆమె ప్లాన్స్ నెర‌వేరే ఛాన్సులు క‌న‌ప‌డ‌డం లేదు.

తాను గ‌తంలో ఎమ్మెల్యేగా ఉన్న పెనుగొండ నుంచి సీనియ‌ర్ నేత పార్థ‌సార‌థి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. దీంతో ఆమె ధ‌ర్మ‌వ‌రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌రదాపురం సూరిని త‌ప్పించి అక్క‌డ ప‌ట్టు పెంచుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రీరామ్‌ను అక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌ని చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అయితే సూరి కూడా సునీత‌ను త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కాలుమోప‌నీయ‌డం లేదు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న చంద్ర‌బాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. చంద్ర‌బాబు ధ‌ర్మ‌వ‌రంలో నీకేం ప‌ని అంటూ సునీత‌కు వార్నింగ్ ఇచ్చిన‌ట్టు కూడా స‌మాచారం. దీంతో సునీత డైల‌మాలో ప‌డిపోయారు. ఇక త‌న కుమారుడిని ఆమె పొలిటిక‌ల్ ఎంట్రీ చేయించాలి అంటే త‌న రాఫ్తాడును త్యాగం చేయ‌డం మిన‌హా ఆమెకు మ‌రో ఆప్ష‌న్ లేకుండా పోయింది. దీంతో సునీత ప‌రిస్థితి ముందు నుయ్యి – వెన‌క గొయ్యిలా మారింది. ఇదిలా ఉంటే శ్రీరామ్ ఇప్పుడు లోకేష్ చెంత చేరి ఆయ‌న‌తో స‌ఖ్య‌త‌తో ఉంటున్నాడు.