నన్ను కించ పరిచిన పార్టీలో ఒక్క నిమిషమైన ఉండనంటున్న బోండా

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత.. ఏపీలో రాజ‌కీయాలు హీటెక్కాయి. మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కని వారు ఇప్పుడు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌నే గుస‌గుస‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అసంతృప్తి నాయ‌కులకు చెందిన క్యాడ‌ర్ తీవ్ర ఆగ్ర‌హ జ్వాల‌తో ఉంది. ముఖ్యంగా ప్ర‌తిపక్షంపై నిత్యం విరుచుకుప‌డే విజ‌యవాడ ఎమ్మెల్యే బోండా ఉమ‌.. త‌న‌కు మంత్రిప‌ద‌వి ద‌క్క‌కపోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న ప‌వ‌ర్ స్టార్ జ‌న‌సేన వైపు అడుగులేయ‌బోతున్నార‌ని ఆయ‌న ఆనుచ‌రులు చెబుతున్నారు.

ఏపీ మంత్రివర్గ విస్తరణలో అలకలు తార‌స్థాయికి చేరాయి. పార్టీకి నిబ‌ద్దులై ఉంటారనుకున్న నేతలు తమకు బెర్త్ దక్కకపోవడంపై తీవ్రంగా ఫైరయ్యారు. తనకు మంత్రి పదవి కట్టబెట్టకపోవడంపై పార్టీ అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పార్టీ ఎంపీలు కేశినేని నాని – కొనకళ్ల నారాయణ బోండా ఇంటి వద్దకు చేరారు. ఈ సందర్భంగా వారివద్ద బోండా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.

రౌడీయిజం పేరుతో మంత్రి పదవి ఎగ్గొట్టారని ఎంపీలు, సన్నిహితుల వద్ద బోండా ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంపై ఎంతగా విరుచుకుపడ్డానో చంద్రబాబుకు తెలియ‌దా అని తోటి నేతల వద్ద వాపోయినట్లు సమాచారం. చంద్రబాబు తనను వాడుకుని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. జనసేన నుంచి ఆహ్వానం ఉన్నా.. టీడీపీని వదలలేదని గుర్తుచేశారు. ఎంపీలు బుజ్జగిస్తున్నప్పటికీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ససేమిరా అని బోండా తేల్చిచెప్పినట్లు సమాచారం.

మరోవైపు బోండా ఉమాకి మద్దతుగా 18 మంది కార్పొరేటర్లు, 20 డివిజన్ల పార్టీ అధ్యక్షులు రాజీనామాకు సిద్దంగా ఉన్నారు. బోండా ఇంటికి వారంతా చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని బోండా అనుచరుల వెల్లడించారు. తమను కించపరిన పార్టీకి స‌మాధానం చెప్పాలంటే జనసేనలో చేరడమే సరైన నిర్ణయమని బోండాకు అనుచరులు చెప్తున్నట్లు సమాచారం. మరి ఈ విష‌యంపై చంద్ర‌బాబు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే!