ఉలిక్కి పడ్డ చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఆశావాహుల మ‌ధ్య పెద్ద చిచ్చే పెట్టింది. మంత్రి ప‌ద‌వులు రాని ఆశావాహులు, సీనియ‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వి పోయిన సీనియ‌ర్ లీడ‌ర్ బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు సైతం తాను రాజీనామాకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియ‌ర్ లీడ‌ర్ గౌతు శివాజీకి మంత్రి ప‌ద‌వి రాలేద‌ని ఆయ‌న కుమార్తె శిరీష త‌న జిల్లా పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సైతం సిద్ధ‌ప‌డ్డారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు గెలిచిన ధూళిపాళ్ల న‌రేంద్ర మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో పార్టీ మోసం చేసిందంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ సైతం అదే దారిలో ఉన్నారు.

ఇక దూకుడు రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. అధికారంలో లేనపుడు పార్టీ కోసం పనిచేసినా గుర్తింపు రాలేదని ఆయ‌న‌ ఆవేదన చెందుతున్నారు. తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కార్య‌క‌ర్త‌ల కోసం ఫైట్ చేస్తున్న‌ప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉండి త‌న‌పై ఎన్నో కేసులు పెట్టించిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి దక్కడాన్ని చింతమనేని జీర్ణించుకోలేకపోతున్నారు.

కేబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగిన వెంట‌నే ఏలూరు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో చింతమనేని తన అనుచరులతో సమావేశమయ్యారు. తాను మాత్రం మ‌రో పార్టీలో చేరేది లేద‌ని… అవసరమైతే కొత్త పార్టీ పెడతానని ఆయన అన్నారు. చింత‌మ‌నేని కొత్త పార్టీ వార్త‌లు అధికార టీడీపీలో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. దూకుడు స్వ‌భావం ఉన్న చింత‌మ‌నేని ఏం చేస్తాడా ? అని ఇప్పుడు ఒక్క‌టే టెన్ష‌న్ నెల‌కొంది.