కేసీఆర్‌తో జ్యోతి రాధాకృష్ణ రాజీ..!

ఏకంగా 365 రోజుల పాటు ఒక చాన‌ల్‌పై నిషేధం! దీనిపై వ‌రుస‌గా ప‌త్రిక‌ల్లో అలుపెర‌గ‌ని పోరాటాలు! ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌ క‌థ‌నాలు.. ఎటు చూసినా ప్ర‌భుత్వంతో ఢీ అంటే ఢీ అనేలా వ్య‌వ‌హారం!! సీన్ క‌ట్ చేస్తే.. తిట్టిన నోళ్లే ఇప్పుడు పొగుడుతున్నాయి. ఆ చాన‌ల్‌కు చెందిన ప‌త్రిక‌ల్లో ప్ర‌భుత్వాన్ని ఆకాశానికెత్తేసే క‌థనాలు! పాల‌న అంతా సుభిక్షం.. ఇలా అయితే త్వ‌ర‌లోనే బంగారు తెలంగాణ సాధ్య‌మ‌నేంత‌గా పొడ‌గ్త‌లు! ఇదీ ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక వ్య‌వ‌హార‌శైలి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం, సీఎం కేసీఆర్.. ఏబీన్‌, ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌కు మ‌ధ్య వార్ ముగిసింది. పూర్వ స్నేహ బంధం ప‌రిమ‌ళించింది. దీని ఫ‌లిత‌మే.. ఇప్పుడు ఆంధ్ర‌జ్యోతి స‌ర్క్యులేష‌న్ పెరిగింద‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి.

న‌మ‌స్తే తెలంగాణ‌, టిన్యూస్‌.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్న మీడియా! అయితే ఇప్పుడు అనధికారికంగా ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక కూడా టీఆర్ఎస్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతోంది. ఎక్క‌డ చూసినా టీఆర్ఎస్ అనుకూల వార్త‌లే! రోజుకో స్పెష‌ల్ స్టోరీ క‌నిపిస్తోంది. ఇదే ప‌త్రిక‌లో కొన్ని రోజుల క్రితం.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తూనే వార్త‌లు అధికంగా ఉండేవి. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీవీ9, ఏబీన్ చాన‌ల్‌పై ఉక్కుపాదాన్ని మోపింది. ఆప్తమిత్రులైన కేసీఆర్‌-రాధాకృష్ణ మ‌ధ్య‌.. విభేదాలు త‌లెత్తాయి! దీంతో వీరిద్ద‌రికీ మ‌ధ్య గ్యాప్ చాలా పెరిగింది.

స‌డ‌న్‌గా వీరి మ‌ధ్య స్నేహ బంధం మ‌ళ్లీ చిగురించింది. దేవుడిపై అంత న‌మ్మ‌కం లేని రాధాకృష్ణ‌.. ప‌ర‌మ భ‌క్తుడైన కేసీఆర్ నిర్వ‌హించిన చండీ యాగానికి వెళ్ల‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. దీనిపై ముందుగా రాధాకృష్ణ‌కు కేసీఆర్ ఆహ్వానం పంపిచార‌ట‌. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రికీ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత విభేదాలు ఉన్న విష‌యం తెలిసిందే! కానీ వాట‌న్నింటినీ ప‌క్క‌న పెట్టి మ‌రీ.. చండీయాగానికి వెళ్లారు. దీంతో ఇక వీరిద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ స్నేహానికి ఇక్క‌డే బీజం ప‌డింద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ బంధం తార‌స్థాయికి వెళ్లింద‌ట‌. అందుకే టీన్యూస్‌, న‌మ‌స్తే తెలంగాణ కంటే.. ఆంధ్రజ్యోతి ప‌త్రికే ఎక్కువ‌గా టీఆర్ఎస్‌ను మోస్తోంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఆంధ్ర‌జ్యోతి స‌ర్క్యులేష‌న్ పెర‌గ‌డానికి కూడా ఇది ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య రాజీ వ‌ల్ల ఇటు ప‌త్రిక‌కు, అటు టీఆర్ఎస్‌కు ల‌బ్ధి చేకూరింద‌నే టాక్ న‌డుస్తోంది. మొత్తానికి ఇద్ద‌రు మిత్రులు క‌లిసిపోయారు. చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. మ‌రి ఈ బంధం.. ఎంత‌కాలం కొనసాగుతుందో ఏమో కాల‌మే నిర్ణ‌యించాలి.