జ‌గ‌న్ కొంప ముంచుతున్న బాబు కోవ‌ర్టులు

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌పైకి రావడంతో ఆ పార్టీ నేత‌ల్లో గంద‌ర‌గోళం మొద‌లైంది. జ‌గ‌న్‌కు చెందిన ఒక చానెల్‌లో.. కేసుల‌కు సంబంధించిన వ్య‌క్తికి ఇంట‌ర్వ్యూ చేసిన స‌మ‌యంలో.. ఈ కేసుల గురించి ప్ర‌స్తావించ‌డంతోనే ఇదంతా జ‌రిగింద‌ని వారు అంత‌ర్గ‌తంగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఆ కేసుల గురించి ఎవ‌రు అడ‌గ‌మ‌న్నారు అనేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కోర్టు ప‌రిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడ‌ద‌ని తెలిసినా.. వీటి గురించి అడిగేలా చేస్తున్న‌దెవ‌రు? జ‌గ‌న్ శిబిరంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు కోవ‌ర్టులు ఉన్నారా? అనే ప్ర‌శ్న‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు గడిచినా.. ఇంకా ఓనమాలు నేర్చుకోవడం లేదని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొండిగా, మూర్ఖంగా ముందుకెళ్లడం తప్ప…వెనకా ముందు చూసుకోకుండా ఆయన వ్యవహరిస్తున్నారని.. దీంతో దెబ్బలు తగులుతున్నాయని అంటున్నారు. ఎవరు ఏమి చెప్పినా, సలహాలు ఇచ్చినా… వినపోవడంతో ప్రత్యర్థులు దీన్ని అస్త్రంగా వాడుకుంటున్నారని చెబుతున్నారు. నమ్మినవారిని అందలం ఎక్కించడం…వారు ఏం చేసినా పట్టించుకోకపోవడం ‘జగన్‌’ నైజమని దీంతో ఆయన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో జగన్‌ శిబిరంలోని వ్యూహకర్తలు చేసిన తప్పు…ఇప్పుడు జగన్‌ కండీషనల్‌ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటీషన్‌ వేసిందని, కోర్టు కనుక ఈ పిటీషన్‌ను అంగీకరిస్తే జగన్‌ మళ్లీ జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. ఇదంతా జగన్‌ తాను నమ్మినవారి వల్లనే జరుగుతుందని జగన్‌ సామాజికవర్గానికి చెందిన నేతలు అంటున్నారు. ముఖ్యంగా సాక్షి ఎడిటోరియల్‌ గ్రూప్‌ చేసిన తప్పులకు ఆయన బలికావాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. కోర్టులో ఉన్న కేసుల గురించి ప్రస్తావించాలని సలహా ఇచ్చిందెవరని వారు పలువురిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కొంత మంది జర్నలిస్టుల ముసుగులో జగన్‌ శిబిరంలో చేరి కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ ఈ జర్నలిస్టులపై వారు గురిపెడుతున్నారు. వారు జగన్‌ శ్రేయస్సు కోసం పాటుపడుతున్నా వీరిపై కన్నేసి ఉంచాలని కోరుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారిని అసలు నమ్మవద్దని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన కిచెన్‌ క్యాబినెట్‌లో కీలకంగా వ్యవహరించిన జర్నలిస్టు, ఆయన శిష్యులు ఇప్పుడు జగన్‌ భజన చేస్తున్నా… వారే కోవర్టులుగా ఉన్నారని వీరు అన్యాపదేశంగా విమర్శిస్తున్నారు.